Friday, April 19, 2024

మసాజ్‌ పేరుతో యువతుల వల.. ఒళ్లంతా గుల్ల!

దుబాయ్‌: రండి…రండి… ఒళ్లంతా చక్కగా మసాజ్‌ చేస్తాం… మిమ్మల్ని తేలికపరుస్తాం… అంతేనా మానసిక ప్రశాంతత కలిగిస్తాం… మాతో మసాజ్‌ చేయించుకుంటుంటే… నా సామిరంగా అసలు గాల్లో తేలిపోతారు… ఇదీ లాంగ్వేజ్‌. ఇదంతా దుబాయ్‌లోని అల్‌రఫాలో ఉన్న ఒక మసాజ్‌ సెంటర్‌ ప్రకటన. ఒక డేటింగ్‌ యాప్‌లో ప్రత్యక్షమైంది. ఇంకేముంది… మనోడొకడు అంటే మన ఇండియనే సొల్లు కార్చుకుంటూ ఆ ప్రకటనలో ఇచ్చిన మొబైల్‌కు ఫోన్‌ చేశాడు. అందమైన అమ్మాయిలతో అప్పుడే మసాజ్‌ చేయించేసుకుంటున్నట్టు తెగ కిర్రెక్కిపోయాడు. ఆ ఫోన్‌లో ఒక తియ్యని గొంతు ఒక అపార్టు మెంటు అడ్రస్‌కు రమ్మని రాగాలు పోతూ పిలిచింది.

మనోడు పరుగెత్తాడు. తలుపుతీసిన ఒక యువతి చెయ్యిపట్టుకుని గబుక్కున లోపలికి లాగి తలుపేసేసింది. ఇక అప్పుడు మొదలైంది అసలు రచ్చ. మనోడి బట్టలు తీసేసి ఒక బెడ్‌పై పడుకోబెట్టి కట్టేశారు. ఇదేదో సినిమా అనుకునేరు. నిజంగానే జరిగింది. ఇంకో అందగత్తె కిచెన్‌లోకి వెళ్లి ఒక చాకు పట్టుకు వచ్చింది. గొంతు మీద పెట్టింది. మనోడి మొబైల్‌ అన్‌లాక్‌ చేయించి బ్యాంక్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేయించారు. ఇక అంతే మొత్తం సొమ్మంతా గోవిందా… రకరకాలు ఎకౌంట్లలోకి బదలాయించేసు కున్నారు. మరో యువతి మనోడి బ్యాంక్‌ కార్డులన్నీ పట్టుకుని ఎదురుగా ఉన్న ఏటిఎంలోకి వెళ్లింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులన్నీ ఖాళీ చేసి దర్జాగా వెళ్లిపోయింది.

మొత్తం నలుగురు యువతులు మనోడ్ని అలా చిత్తు చిత్తు చేసి మసాజ్‌ చేసేశారు. ఒక రోజంతా అదే అపార్ట్‌ మెంట్‌లో బంధించి ఆ తర్వాత అతడి కట్లు ఊడదీసి పరారయ్యారు… చివరకు వాళ్లలో ముగ్గురు ముద్దుగుమ్మలను పోలీసులు పట్టుకున్నా ప్రయోజనం లేక పోయింది. అప్పటికే సొమ్మంతా ఎంజాయ్‌ చేసేశారంట. సో, కుర్రాళ్లూ తస్మాత్‌ జగ్రత్త… ఎక్కడైనా ఇదే తంతు…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement