Thursday, April 25, 2024

బూస్టర్‌ తీసుకున్నాసోకుతున్న వైరస్.. బీఏ-2 దెబ్బకు కుటుంబం మొత్తం మంచాన..

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ2 కుటుంబం మొత్తాన్ని మంచాన పడేస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కుటుంబంలో ఒక్కరికి ఈ వేరియంట్‌ వైరస్‌ సోకితే మిగతా అందరికీ వ్యాపిస్తోంది. కుటుంబాలపై దాడి విషయంలో ఒమిక్రాన్‌ బీఏ1 వేరియంట్‌తో పోలిస్తే… బీఏ2 వేరియంట్‌ 39శాతం అధిక వేగంతో దాడిచేస్తోంది. బీఏ1 వేరియంట్‌ 29శాతం మేరనే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటోంది. కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని సోకడంలో బీఏ1 వేరియంట్‌తో పోలిస్తే బీఏ2 1.34రెట్లు అధిక వేగంతో వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి జనవరి చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌కూ ఒమిక్రాన్‌ బీఏ2 వేరియంట్‌ లొంగడం లేదని సర్వే హెచ్చరించింది. వ్యాక్సిన్‌ వేసుకున్నా బీఏ2 వేరియంట్‌ సోకుతోందని స్పష్టం చేసింది. వైరస్‌ లోడ్‌ కూడా అధికంగానే ఉంటోంది. చివరకు బూస్టర్‌ డోస్‌ తీసుకున్నా కూడా బీఏ2 సోకుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బూస్టర్‌ డోస్‌ తీసుకున్న వారిలో బీఏ1 వేరియంట్‌ కల్పించే ఇన్‌ఫెక్షన్‌తో పోలిస్తే బీఏ2 1.23రెట్లు అధికంగా ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతోంది.

అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బీఏ2 సోకితే… ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాపించడం లేదు. అంటే కరోనా వ్యాక్సినేషన్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను, ప్రాణాపాయ ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు సూపర్‌ స్ప్రెడర్‌గా మారే ప్రమాదాన్ని నివారిస్తోందని తేలింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 99శాతం ఒమిక్రాన్‌ బీఏ2 వేరియంట్‌వేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బీఏ2 సోకిన తర్వాత కోలుకున్నప్పటికీ పోస్టు కొవిడ్‌ సమస్యలు వెంటాడుతు న్నాయి. కొద్దిరోజులపాటు నీరసం, ఒంటినొప్పులు, జలుబు, చిరాకు, ఆకలి తగ్గిపోవడం, చేసే పనిమీద ఏకాగ్రత కుదరకపోవటం వంటి అనారోగ్య లక్షణాలతో జనం సతమతమవుతున్నారు. వైరస్‌ బారిన పడిన తర్వాత రెండు వారాలపాటు నీరసం, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు లేని వృద్ధులు కూడా ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్నాక మునుపటిలా హుషారుగా జీవితాన్ని గడపలేకపోతున్నారు.

కొత్త వేరియంట్‌ పుట్టుకను ఆపాలంటే జాగ్రత్తలే దిక్కు

ప్రస్తుతం ఒమిక్రాన్‌ బీఏ2 వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మరో ఆరు నెలల వరకు ఒమిక్రాన్‌ నుంచి ఏ కొత్త వేరియంట్‌ వచ్చినా ఎదుర్కొనే యాంటీబాడీస్‌ ప్రజల్లో వృద్దిచెందాయి. అయితే ఆ తర్వాత ఒమిక్రాన్‌ మాదిరిగా మరో కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్‌ పుట్టుకను ఆపాలంటే కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు వైరస్‌ సోకకుండా కాపాడటంతోపాటు కరోనా కొత్త వేరియంట్‌ పుట్టకుండా నిరోధిస్తాయి. వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుంటే కరోనా కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement