Saturday, April 20, 2024

స‌ముద్రంలోకి కొట్టుకుపోయి.. 24రోజుల త‌ర్వాత బ‌తికి బ‌య‌ట‌ప‌డిన వ్య‌క్తి

గ‌త డిసెంబ‌ర్ లో త‌న ప‌డ‌వ‌కి రిపేర్ చేస్తుండ‌గా అల‌ల ధాటికి ప‌డ‌వతో పాటు స‌ముద్రంలోకి కొట్టుకుపోయాడు డొమినికాకు చెందిన ఎల్విస్‌ ఫ్రాంకోయిస్‌ (47).. ఆ తర్వాత అక్కడి నుంచి ఒడ్డుకు చేరేందుకు అతను ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దాంతో ఎవరైనా కాపాడకపోతారా అని ఎదురుచూస్తూ ఏకంగా 24 రోజులపాటు ఆయన సముద్రంలో గడపాల్సి వచ్చింది. ఈ 24 రోజులు అతనికి తిండి లేదు, మంచినీళ్లు లేవు. ఒక బాటిల్‌లో ఉన్న కెచప్‌, వెల్లుల్లి పౌడర్‌, మాగీ క్యూబ్‌లే అతనికి ఆహారం అయ్యాయి. ఆ మూడు పదార్థాలకు కొద్దిగా వర్షం నీళ్లు కలిపి, మిశ్రమం చేసి ఆహారంగా తీసుకునేవాడు. ఈ క్రమంలో తన దగ్గరున్న ఒక చిన్న అద్దం సాయంతో తన మీదుగా ఆకాశంలో వెళ్తున్న విమానం సిబ్బందికి సిగ్నల్స్‌ ఇచ్చాడు. సూర్యకాంతిని అద్దం మీద పడేలా చేసి, అలా అద్దం మీద పడిన కాంతిని విమానం మీదకు మళ్లించాడు.

దాంతో విమానం సిబ్బంది కొలంబియాకు 120 నాటికల్ మైళ్ల దూరంలో అతడు నడి సముద్రంలో చిక్కుబడి పోయినట్లు గుర్తించారు. వెంటనే కొలంబియా నేవీకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న నేవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధితుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. సముద్రంలో గడిచిన భయంకర రోజుల గురించి ఫ్రాంకోయిస్‌ తనను కాపాడిన కొలంబియా నేవీ సిబ్బందికి వివరించాడు. 24 రోజులు తనకు ఎలాంటి ఆహారం లేదని చెప్పాడు. తన పడవలో ఒక బాటిల్‌ కెచప్‌, కొన్ని మాగీ క్యూబ్స్‌, కొద్దిగా వెల్లుల్లి పౌడర్‌ ఉన్నాయని, సాధ్యమైనన్ని రోజులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ మూడింటిని మిక్స్‌ చేసి, వాటికి కొన్ని నీళ్లు కలిపి తినేవాడినని తెలిపాడు. పడవ మునిగిపోకుండా రోజూ తన పడవలోకి వస్తున్న నీళ్లను ఎత్తిపోస్తూ ఉండేవాడినని, ఆ మార్గంలో వెళ్లే నావికులు తనను గుర్తించడానికి వీలుగా పడవలో నిప్పు వెలిగించేవాడినని ఎల్విస్‌ ఫ్రాంకోయిస్‌ చెప్పాడు. కానీ చాలారోజులు తనను ఎవరూ గుర్తించలేదని, ఆఖరికి అద్దంతో సిగ్నల్స్‌ ఇవ్వడం ద్వారా బతికి బట్టకట్టానని తెలిపాడు. ఫ్రాంకోయిస్‌ చెప్పినవన్నీ కొలంబియన్‌ నేవీ సిబ్బంది వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. మొత్తానికి అద్దం ఇత‌డి ప్రాణాల‌ను కాపాడింద‌న్న‌మాట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement