Sunday, June 13, 2021

బోయిన్ పల్లిలో విషాదం… నాలాలో పడి బాలుడి మృతి

హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో  ప్రమాదవశాత్తు కాలుజారి నాలాలో పపడిపోయాడు.  ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆనంద్‌సాయి గల్లంతయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టినా.. ఆ బాలుడు ప్రాణాలు ద‌క్క‌లేదు. నాలాలో గాలించి బాలుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు కళ్లముందే ఆడుకుంటూ సందడి చేసిన కొడుకును అంతలోనే నాలా మింగేయటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతిపట్ల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఘటనల దృష్ట్యా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News