Wednesday, April 24, 2024

గాంధీలో మృత్యు ఘోష: గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు!

కరోనా సమయంలో చికిత్సే కాదు అంత్యక్రియల ప్రక్రియ కూడా అత్యంత ఖరీదుగా మారిపోయింది. బతుకు పోరాటంలో శ్వాస విడిచిన బాధితులకు చివరకు సాగనంపే ఆ నలుగురు కరువయ్యారు. కోవిడ్ వ్యాప్తి భయంతో అంత్యక్రియలకూ నోచుకోవట్లేదు. తెలంగాణలో అధిక కరోనా మరణాలు సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో సంభవిస్తున్నాయి. ఇతర ఆస్పత్రుల్లో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులను ఇక్కడికి తరలిస్తుండటంతో రోజూ పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో కరోనా మృతదేహాలు పేరుకుపోతున్నాయి. గాంధీ ఆస్పత్రి మార్చురీలో 300 మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు భారీగా ఖర్చవుతుండటంతో బడుగు జీవులు చాలామంది వదిలేసి వెళ్తున్నారు. సకాలంలో అంత్యక్రియలు పూర్తి కావడంలేదు. అశాస్త్రీయ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం, బంధువుల భయాందోళనల కారణంగా మృతుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. రోజుల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని మార్చరీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో పాటు ఇతర దీర్ఘకాల వ్యాధుల కారణంగా గాంధీ ఆసుపత్రిలో రోజూ సగటున 40-50 మంది వరకు చనిపోతున్నారు. వాటిలో సగం మాత్రమే అదేరోజు బయటకు వెళ్తుండగా.. మిగిలిన వాటిని మార్చురీలో ఉంచుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతంగా గాంధీ మార్చురీలో 300 మృతదేహాలు పేరుకుపోయాయి. దీంతో దుర్గంధం భరించలేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్‌ మృతదేహాలను నగరంలోని శ్మశాన వాటికలకు తీసుకువెళ్లి దహనం చేసేందుకు రూ.25 వేలకు ఖర్చవుతోంది. జిల్లాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.50 వేలకు పైగా భరించాల్సి వస్తోంది. దీంతో అంత ఖర్చు భరించలేని పేద కుటుంబాలకు చెందిన వారు మృతదేహాలను అక్కడే వదిలేసి వెళ్తున్నారు. ఈ ఖర్చు భరించలేక కొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ కారణంతోనే గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలు పేరుకుపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement