Thursday, April 25, 2024

Hyderabad: సబ్​లీజ్​ పేరిట మోసం.. ఎమ్మెల్యేల కేసులో నిందితుడు నందకుమార్​పై మరో రెండు కేసులు

ఇద్దరు వ్యక్తులను ఆర్థికంగా మోసం చేశాడన్న ఆరోపణలపై ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్​ అయిన కోరె నంద కుమార్‌పై హైదరాబాద్​లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ‘గాడ్జెట్ స్టూడియో’ పేరుతో వ్యాపారం చేస్తున్న నార్సింగికి చెందిన మొబైల్ యాక్ససరీస్ వ్యాపారి మిట్టా సందీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై తొలి కేసు బుక్ అయ్యింది. నంద కుమార్ నిర్వహిస్తున్న దక్కన్ కిచెన్ (హోటల్ వ్యాపారం)లో పార్టనర్​గా ఉన్న సయ్యద్ అయాజ్ ఫిర్యాదు మేరకు రెండో కేసు నమోదైంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

గాడ్జెట్​ స్టూడియో యజమాని మిట్లా సందీప్​కుమార్​ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇట్లా ఉన్నాయి. గత మార్చి నెలలో బంజారాహిల్స్ లో కోరే నంద కుమార్‌ను కలుసుకున్నాడని, హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నెం. 01లోని స్థలాన్ని లీజుకు తీసుకున్న విషయం గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దీని ప్రకారం అతను తాను లీజుకు తీసుకున్న స్థలంలో కొంత భాగాన్ని అద్దె ప్రాతిపదికన సందీప్​కుమార్​కు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించాడు. సందీప్​కు, నందకుమార్‌కు మధ్య దీని గురించి మౌఖిక ఒప్పందం మాత్రమే కుదిరింది. ఈ క్రమంలో అడ్వాన్స్‌గా రూ.12 లక్షలు, అద్దెగా నెలకు రూ.1.50 లక్షలు చెల్లించాడు మిట్ట సందీప్​కుమార్​.

ఇక.. అడ్వాన్స్ మొత్తాన్ని స్వీకరించిన తర్వాత ఆ ప్రదేశంలో స్టోర్ స్థాపించడానికి దాదాపు రూ. 50 లక్షల దాకా వెచ్చించాడు. అయితే.. రెండు నెలల క్రితమే నంద కుమార్ స్థల యజమాని దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు నుంచి ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు తనకు తెలిసిందని ఆయన తెలిపారు. కాగా, వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నంద కుమార్‌కు పేర్కొన్న ప్రాంగణాన్ని సబ్‌లెట్ చేసే చట్టపరమైన హక్కు లేదు.

అయితే.. ఈ విషయం తెలిసినా.. నందకుమార్​ తనకు చెప్పకుండా తన నుండి కొంత మొత్తాన్ని వసూలు చేసి, నందకుమార్​ లీజు తీసుకున్న ప్లేసులో నుంచి కొంత భాగాన్ని తనకు లీజుకు ఇచ్చాడని సందీప్​ తెలిపాడు. ఈ క్రమంలో దగ్గుబాటి సురేష్​బాబు, వెంటటేష్​ మధ్య జరిగిన లీజు ఒప్పందం వివరాలను ఉద్దేశపూర్వకంగా, తనతో చెప్పకుండా దాచిపెట్టాడని సందీప్​ తన ఫిర్యాదులో పేర్కొననాడు. నందకుమార్​ మోసపూరిత ప్రవర్తన కారణంగా తాను రూ. 65 లక్షలు నష్టపోయానని మిట్ట సందీప్​కుమార్​ పేర్కొన్నాడు. ఈ విషయంలో ఐపీసీ 406, 420 కింద కోరె నందకుమార్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

ఇక.. రెండో కేసుకు సంబంధించి నంద కుమార్ నిర్వహిస్తున్న దక్కన్ కిచెన్ (హోటల్ వ్యాపారం)లో భాగస్వామిగా ఉన్న సయ్యద్ అయాజ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది. డెక్కన్ కిచెన్‌లో అయాజ్, అతని సోదరుడు సయ్యద్ అజర్, వినయ్ గవానే, కౌశిక్ కన్నం పార్టనర్స్​గా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021, జూన్ నెలలో నంద కుమార్​తో తమకు పరిచయం ఏర్పడిందని, బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 1లోని స్థలాన్ని అద్దె ప్రాతిపదికన ఇచ్చాడని వారు తెలిపారు. నందు కుమార్‌తో కలిసి తాము సమావేశాలు నిర్వహించి, దాదాపు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అతని స్థలాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని అడ్వాన్స్ గా రూ. 12 లక్షలు, అద్దె ప్రాతిపదికన రూ. 2 లక్షలకు లీజుకు తీసుకోవాలని నంద కుమార్‌తో కలిసి తాము ఒక ఒప్పందానికి వచ్చామని పేర్కొన్నారు.

నెల, మొత్తం అమ్మకంపై 10 శాతం కమీషన్. తర్వాత తాము నందు కుమార్ కంపెనీ W3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌కు ఆన్‌లైన్‌లో రూ. 6 లక్షలు చెల్లించామన్నారు. నంద కుమార్‌కు అడ్వాన్స్ గా రూ. 6 లక్షల నగదును కూడా చెల్లించామని, తర్వాత తాము పైన పేర్కొన్న ప్రాంగణంలో దాదాపు 65 లక్షల రూపాయలు వెచ్చించి “డెక్కన్ కిచెన్” పేరుతో ఒక హోటల్‌ని స్థాపించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దగ్గుబాటి వెంకటేష్‌, దగ్గుబాటి సురేష్‌బాబు నుంచి నందకుమార్‌ లీజుకు తీసుకున్నట్లు తమకు తెలిసిందని, ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఒప్పందం ప్రకారం నంద కుమార్‌కు పేర్కొన్న స్థలాన్ని సబ్‌లెట్ చేసే చట్టపరమైన హక్కు లేదని వారు  ఆరోపించారు.

దగ్గుబాటి సురేశ్​బాబు, వెంకటేష్​ భూములపై ఎటువంటి హక్కు లేకున్నా.. లీజు పేరిట తీసుకుని తమను భారీ మొత్తంలో మోసం చేశాడని ఫిర్యాదులో తెలిపారు. 2022 జులై నెలలో ఈ విషయం తెలిసిన తర్వాత తాము ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని నంద కుమార్‌ను కోరినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా డెక్కన్ కిచెన్‌ను ఖాళీ చేయాలని తాము భావించినట్టు కూడా వారు చెప్పారు. అయితే.. నందకుమార్​ తమను ఖాళీ చేయకుండా బెదిరించాడని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని పేర్కొన్నారు. అసలు వాస్తవాలను దాచిపెట్టి తమను మోసం చేశాడని, ఇట్లా దాదాపు 70 లక్షల రూపాయల నష్టం కలిగిందన్నారు. వారి ఫిర్యాదు మేరకు ఐపీసీ 406, 420, 506 సెక్షన్ల కింద పోలీసులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement