Wednesday, April 17, 2024

ఈ విద్యార్థులు రెండు చేతులతో రాయడమే కాదు.. ఐదు భాషల్లో ప్రావీణ్యం కూడా ఉంది

ఇక్కడ విద్యార్థులు ఒక చేతితో కాదు..ఏకంగా రెండు చేతులతో రాయడం విశేషం.. మధ్యప్రదేశ్‌లో ఓ స్కూల్‌లో విద్యార్థులు రెండు చేతులతో ఏక కాలంలో రాస్తారు. మూడు భాషలు కాదు.. ఏకంగా ఐదు భాషల్లోనూ మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నారు. వారి రాస్తున్న వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో సింగ్రౌలీ జిల్లాలో బుధేలా గ్రామంలో వీణా వాడిని పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ స్కూల్‌లో సుమారు వంద మంది విద్యార్థులు తమ రెండు చేతులతో ఏకకాలంలో రాతలు రాస్తారు. అంతేకాదు, వీరు హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ, స్పానిష్ భాషల్లో ప్రావీణ్యులు.1999లో స్థాపించిన ఈ స్కూల్‌ నుంచి 480 మంది డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులు రెండు చేతులతో రాసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.

ఇక్కడ రెగ్యులర్ క్లాసులతోపాటు విద్యార్థులకు యోగా, మెడిటేషన్ కూడా రోజూ ఒక గంట చెబుతారు. ఈ స్కూల్ విద్యార్థులు 250 పదాల రచనను ఒక్క నిమిషంలోపే తర్జూమా చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఆ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న పంకజ్ యాదవ్ మాట్లాడుతూ.. నేను ముందు నా కుడి చేతితోనే రాసే వాడిని. ఆ తర్వాత ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాను. థర్డ్ స్టాండర్డ్‌లో నేను రెండు చేతులతో రాయడం నేర్చుకున్నాను’ అని తెలిపాడు.మరో విద్యార్థి ఆదర్శ్ కుమార్ మాట్లాడుతూ, ‘నేను నా లోయర్ క్లాసులో ఉన్నప్పుడు కుడి చేతితో రాసేవాడిని. ఆ తర్వాత ఎడమ చేతితో రాయడం మొదలు పెట్టాను. నాకు ఐదు భాషలు తెలుసు’ అని వివరించాడు. మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వీరికి ప్రేరణ అని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ‘మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రెండు చేతులతో పనులు చేయగలిగే నైపుణ్యం కలవారు. ఆయన రెండు చేతులతో రాయగలిగే సమర్థుడు. ఆయనను మేం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాం. అదే మా విద్యార్థులను ఈ స్కిల్ నేర్చుకునేలా పురికొల్పింది’ అని ప్రిన్సిపల్ విరంగద్ శర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement