Tuesday, April 23, 2024

100 ఏండ్ల బామ్మలో ఇంకా జోష్ త‌గ్గ‌లే.. బ‌ర్త్ డే వేడుక‌ల్లో బంజారా డ్యాన్స్‌

ఈ బామ్మ‌కు వందేళ్లు.. త‌న 100వ పుట్టిన‌రోజును గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు కుటుంబ స‌భ్యులు. ఐదు త‌రాల‌కు చెందిన కుటుంబ స‌భ్యులంతా ఒకేచోట చేర‌డంతో సంద‌డి నెల‌కొంది. వారంద‌రినీ చూసిన ఈ వందేళ్ల బామ్మ కూడా సంతోషంతో బంజారా నృత్యం చేసింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పులితండ పరిధిలోని బడితండాకు చెందిన ద‌రావ‌త్ ద్వాళికి వందేళ్లు. ధరావత్ ద్వాళి, హనుమంతు నాయక్ దంప‌తులు వ్యవసాయం చేసేవారు. వారికి నలుగురు మగ సంతానం, ఏడుగురు ఆడ సంతానాన్ని సాకుతూ వచ్చారు. వారికి విద్యాభ్యాసం నేర్పించి, పెద్దవాళ్లను చేశారు. నాలుగో కొడుకు రెడ్యా నాయక్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు.

ఆడ సంతానంలో ఏడో కుమార్తె బుజ్జి టీచర్‌గా ప‌నిచేస్తున్న‌ది. 11 మందికి కలిగిన సంతానంలో సుమారు 30 మంది వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం 150 మంది మనువ‌ళ్లు, మనుమరాళ్లు, ముని మనమళ్లు, ముని మనవరాళ్లు, వారి పిల్ల‌లున్నారు. వారంతా క‌లిసి ద్వాళి 100వ పుట్టిన‌రోజును పులితండాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఐదు త‌రాల కుటుంబ స‌భ్యులు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. దీంతో ఆ తండాలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముందుగా ద్వాళితో కేక్ క‌ట్‌చేయించారు. అంద‌రికీ స్వీట్లు పంచిపెట్టారు. స్టేజీపై కుటుంబ స‌భ్యులంతా బంజారా నృత్యం చేస్తుండ‌గా, ద్వాళికూడా వాళ్ల‌తో పాదం క‌లిపింది. ఆమె డ్యాన్స్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో ఆ ప్రాంగ‌ణం మార్మోగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement