Friday, March 29, 2024

స్థానిక పోరులో ఆమెదే పై చేయి….

అమరావతి, : ప్రస్తుతం రాష్ట్రంలో జరుగు తున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా 50 శాతం మంది మహిళలు పంచాయతీ ప్రథమ పౌరులుగా కీలకమైన పగ్గాలు చేపట్టారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోను కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ప్రతిష్టాత్మకమైన ఛైర్‌పర్సన్‌, మేయర్‌ పీఠాలను కూడా సొంతం చేసుకోబోతున్నారు. ప్రతి ఏడాది మార్చి 8వ తేది ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుతుంటారు. అయితే గతంలో కేవలం ఆరోజు వరకే మహిళలకు ప్రాధాన్యత ఉండేది. మిగిలిన రోజుల్లో వారి గురించి పట్టించుకునేవారు చాలా తక్కువ. అయితే రోజులు మారాయి. కాలం మారింది. కొత్త చట్టాలు వచ్చేశాయి. ప్రస్తుత సమాజంలో మహిళలకు పురుషులతో సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ఉద్యోగ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా 50 శాతం వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని తీసుకున్న నిర్ణయం ఆచరణలో అమల్లోకి వచ్చింది. ఫలితంగా 2021 ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పడిన తరువాత తొలిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించారు. ఆ దిశగా వారికే పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ దిశగానే గత నెలలో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఆయా గ్రామ పంచాయతీలకు ప్రథమ పౌరులుగా కీలకమైన పీఠాలను దక్కించుకుని రాజకీయ రంగంలో మేము సైతం రాణించగలమంటూ చాటుకు న్నారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ పోరులోను మహిళలు 50 శాతం మంది బరిలో ఉన్నారు. వీరు కూడా ఎన్నికల తరువాత ఆయా కార్పొరేషన్ల లో కార్పొరేటర్లుగా, మేయర్‌లుగా రాణించబోతున్నారు. వీటితో పాటు విద్య, వ్యాపార , ఉద్యోగ రంగాల్లో గతంతో పోలిస్తే మహిళలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అందుకే 2021 మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
రాజకీయాల్లోనూ.. పురుషులకు ధీటుగా పోటీ
రాజకీయాలంటే పురుషులకే పరిమితమని చెప్పేవారు. వేదికలపై మాట్లాడాలన్నా, బహిరంగ సభల్లో ప్రత్యర్థులపై నిప్పులు చెరగాలన్నా నాయకులకే సాధ్యమని అనేవారు. అయితే అవన్నీ పాత రోజులు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మహిళలు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు సందర్భాన్ని బట్టి వారిపై ఎదురుదాడికి కూడా దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో మహిళా రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో శాసనసభలో ఒకరిద్దరు మాత్రమే మహిళలు కనిపించేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదుల్లో ఉంది. వీటితో పాటు నగరపాలక, పురపాలక సంఘాల్లో కూడా మహిళలు మొక్కుబడిగా ఒకరిద్దరు మాత్రమే కనిపించేవారు. అయితే మారిన రిజర్వేషన్లు, మహిళలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో పురుషులకు ధీటుగా మహిళలు రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.
పంచాయతీల్లోను.. వారిదే హవా
గతంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను ప్రజా ప్రతినిధులకు చెప్పుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొన్ని సందర్భాల్లో అయితే మహిళలు అసలు తమ సమస్యలను చెప్పకుండానే వెనుదిరిగిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఒకరిద్దరి మహిళా నేతలు చట్టసభల్లో ఉంటే వారి ద్వారా తమ ఇబ్బందులను చెప్పుకుని కొంతమేర ఉపశమనం పొందేవారు. అయితే చట్టసభల్లో వారికి ప్రాధాన్యత పెరగడం, మంత్రి వర్గంలో కూడా మహిళలకు గతం కంటే భిన్నంగా అవకాశాలు కల్పించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా 50 శాతం మంది మహిళలకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం పైగా పంచాయతీల్లో మహిళా నేతలదే హవాగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement