Saturday, April 20, 2024

నేనొచ్చాక కమిషన్‌ వేస్తా -దీక్ష ముగింపు సభలో చంద్రబాబు


అరాచకాల నిగ్గు తేలుస్తా
రోజులన్నీ ఒకేలా ఉండవ్‌.. జాగ్రత్త
రాష్ట్రం నుంచే గంజారు రవాణా
ఆధారాలిస్తాం… యూనిఫాం తీసేయండి
దశలవారీ మద్య నిషేధమెక్కడ
అమరావతి, ఆంధ్రప్రభ: పార్టీ కార్యాలయాలపై, నేతలపై దాడులు ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదానికి నిదర్శనమని, రాష్ట్రంలో రోజులన్నీ ఇలాగే ఉండవని తస్మాత్‌ జాగ్రత్త అంటూ అధికార పార్టీ నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. టీడీపీ కార్యాల యాలు, పార్టీ నేతల ఇళ్లపై దాడులు నిరసిస్తూ ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదంపై పోరు పేరిట నిర్వహించిన 36 గంటల దీక్ష శుక్రవారం రాత్రి ముగిసింది. గుమ్మడి సంధ్యారాణి నేతృత్వంలో టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు నిమ్మర సం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ నుంచే వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతుం దని ఆరోపించారు. దేశం మొత్తానికి ఇక్కడి నుంచే సరఫరా అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. యువత భవిష్యత్‌ కోసం తాము పోరాడుతున్నామని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డీజీపీ కార్యాలయానికి వంద అడుగుల దూరంలోనే ఉన్న తమ కార్యాలయంపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని, మరోవైపు ముఖ్యమంత్రి ఇళ్లు, ఏపీ ఎస్పీ బెటాలియన్‌ సమీపంలోనే ఉంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అలాగే గుజరాత్‌ పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్‌కు సంబంధించి లింకు ఆంధ్రప్రదేశ్‌లో బయటపడిందని, విజయవాడ చిరునామా ఉన్నప్పుడు డీజీపీ అప్రమత్తమై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. పాడేరు, నర్సీపట్నం ప్రాంతాల్లో గంజాయి సాగుతో పాటు రవాణా జరుగుతుందని అలాగే విదేశాల నుంచి డ్రగ్స్‌ వస్తున్నాయని మీడియాలో కథనాలు రాలేదా అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ అలవాటు పడితే యువత ఏమైపోతుందోనన్న ఆందోళనతోనే జాగ్రత్తలు చెప్పామని అన్నారు. ఇదే విషయాన్ని తాము మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారని, మేం ఆధారాలిస్తాం యూనిఫాం తీసేయండి మేమే విచారణ చేస్తాం అంటూ పోలీసులపై చంద్రబాబు ధ్వజమెత్తారు.
డ్రగ్స్‌పై సమీక్షించే తీరు ముఖ్యమంత్రికి లేదా?
పొరుగు రాష్ట్రమైన తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి సమీక్ష నిర్వహించారని అయితే మన రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. డ్రగ్స్‌పై సమీక్షించేంత తీరిక ముఖ్యమంత్రికి లేదా అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇంతపెద్ద ఎత్తున మాదకద్రవ్యాల సరఫరా జరుగుతుంటే ప్రభుత్వం అప్రమత్తం కావొద్దా అని నిలదీశారు. మరోవైపు దశలవారీగా మద్యనిషేదం చేస్తామని పాదయాత్రలో హామీలిచ్చారని ఆ హామీలన్నీ ఏమైయ్యాయని ప్రశ్నించారు. మద్యం రేట్లు విపరీతంగా పెంచారని రూ. 60 ఉన్న మద్యం ధర రూ. 200 చేయడంతో మత్తుకు బానిసలైన వారు కరోనా సమయంలో శానిటైజర్‌లు తాగారని అన్నారు. మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో గంజాయికి అలవాటు పడుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే వీళ్లకు భయపడి ప్రశ్నించడం మానుకోవాలా? అసలు మద్యం బాండ్లను మార్చుకునే సాహసం ఎవరైనా చేస్తారా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తీవ్రవాదం, ముఠా రాజకీయాలు, మత విధ్వేషాలు ఉండకూడదనే పోరాటాలు చేశానని, దీనికోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అలిపిరి వద్ద 24 క్లేమోర్‌ మైన్స్‌ పేల్చినా.. భయపడని తాను ఇప్పుడు భయపడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజ కీయ జీవితంలో ఏనాడూ బూతులు మాట్లాడలేదని అన్నారు. అయితే ఇప్పుడు మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు చివరకు గుమస్తాలు కూడా తనను బూతులు తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం కోసం జగన్‌ త ల్లిని, చెల్లిని ఉపయోగించుకున్నారని ఇప్పుడు జగనన్న వదిలిన బాణం తెలంగాణలో తిరుగుతుందని వ్యాఖ్యానించారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని దుయ్యబట్టారు. ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని కోర్టులు ముట్టికాయలు వేసినా.. పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఆనాడు వైఎస్‌ఆర్‌ కూడా తాను గట్టిగా మాట్టాడితే మౌనంగా ఉండేవారే కాని ఇలాంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. పట్టాభి మాట్లాడిన వ్యాఖ్యలకు ఏదో అర్థం వెతికి రీసెర్చ్‌ చేసి తల్లిని కూడా తెరపైకి లాగారని ఆయన విమర్శించారు. తల్లిమీద ఎంత మమకారం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
ధర్మమే గెలుస్తుంది..
తాను చేసేది ధర్మయుద్ధం అని ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులతో వేధిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన సీసీకెమెరా ఫుటేజ్‌ తమవద్ద ఉందని నిందితులు ఎలా తప్పించుకుంటారో చూస్తానని చంద్రబాబు సవాల్‌ విసిరారు. మరోవైపు లోకేష్‌, నాదెండ్ల బ్రహ్మంపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోలీస్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారని చెప్తున్న సమయంలో లోకేష్‌ హైదరాబాద్‌లో ఉన్నారని అలాగే నాదెండ్ల బ్రహ్మం వేరే ఊళ్లో ఉన్నట్లుగా చంద్రబాబు తెలిపారు. పోలీస్‌ అధికారులు చేయకూడని తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చాక కమిషన్‌..
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా అరాచకాలపై కమిషన్‌ వేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు ఎక్కడ దాక్కున్నా చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, యువత, ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement