Friday, April 19, 2024

కాంగ్రెస్‌పైనే బాణాలు ఎక్కుబెట్టిన కేసీఆర్

నాగార్జున సాగర్ ఉపఎన్నిక సందర్భంగా హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సక్కగా ఉంటే తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎందుకు ఎగిరింది అని ప్రశ్నించారు. తన సభను అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నించారని, తనను ప్రజలతో కలవనీకుండా చేశారని కేసీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకునే హక్కు ఉందని తెలిపారు. పదవుల కోసం తెలంగాణను కాంగ్రెస్ నేతలు వదిలిపెట్టారని.. కానీ టీఆర్ఎస్ మాత్రం తెలంగాణ కోసం పదవులనే విడిచిపెట్టినట్లు గుర్తుచేశారు. సమైక్య పాలకులు 60 ఏళ్లు పాలించి తెలంగాణను ఆగమాగం చేశారని విమర్శించారు.

అటు జానారెడ్డి నందికొండకు ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన తన 30 ఏళ్ల హయాంలో డిగ్రీ కాలేజీ కూడా తెప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. తనకు సీఎం పదవి జానారెడ్డి పెట్టిన భిక్షగా చెప్తున్నారని.. ఆయన సీఎం పదవి భిక్ష పెట్టేవాడే అయితే ఆయనే సీఎం కావొచ్చుగా అని సెటైర్ వేశారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దని.. విచక్షణతో ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోవాలని కేసీఆర్ సూచించారు. మంచి చేసేవారిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని, నోముల భగత్ గాలి బాగానే ఉందనిపిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement