Saturday, April 20, 2024

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 200 ప్లస్ స్కోరును ఛేదించిన ముంబై

టీ-20 క్రికెట్‌లో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే అవతలి జట్టులో వణుకు పుడుతుంది. అందునా ప్రత్యర్థి జట్టు చెన్నై అంటే… విజయం సాధించడం దాదాపుగా అసాధ్యం. కానీ శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టు 218 పరుగుల టార్గెట్‌ను అలవోకగా అధిగమించింది. పొలార్డ్ మెరుపులు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చుక్కలు చూపాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు 27 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి మొయిన్ అలీ (58 పరుగులు), డుప్లెసిస్ (50 పరుగులు) తోడు నిలిచారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ దూకుడుగానే ఆటను మొదలు పెట్టారు. తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు రావడంతో లక్ష్యం దిశగానే ముంబై సాగుతున్నట్టు అనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలో రోహిత్, సూర్యకుమార్, డికాక్ అవుట్ కావడంతో ముంబై జట్టు ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన కీరన్ పొలార్డ్ చెన్నై బౌలర్లపై చెలరేగిపోయాడు. గెలుపు బాధ్యతను తనపై వేసుకున్నాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. పొలార్డ్ మ్యాచ్ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. పొలార్డ్‌కు కృనాల్ పాండ్యా తన వంతు సహకారం అందించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించడం ముంబై ఇండియన్స్ జట్టుకు ఇదే తొలిసారి కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement