Saturday, April 20, 2024

ఈటలపై గులాబీ దండు దండయాత్ర!

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వంపై ఈటల చేసిన వ్యాఖ్యలపై మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. ఒక్కసారిగా పార్టీ నేతలు ఈటలను టార్గెట్ చేశారు. ఈటల రాజేందర్‌ మేక వన్నిన పులి అని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను దొర అని సంభోదించడం సరికాదన్నారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్ అని, ముదిరాజులు, బలహీనవర్గాల గురించి ఈటల ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు. కమలాపూర్‌ లో చీమలు పెట్టిన పుట్టలో పాములా చేరారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల పార్టీలోకి రాకముందే కమలాపూర్‌ జడ్పీ పీఠం గెలిచామని గుర్తు చేశారు. పార్టీ గెలిస్తే ఏడవడం.. పార్టీ ఓడితే నవ్వడం ఈటల పని మంత్రి గంగుల ఆరోపించారు.

పదవి పోగానే బీసీ బిడ్డను- ముదిరాజ్ బిడ్డలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఈటల కమలాపూర్ నియోజకవర్గంలో టీఆరెఎస్ నేతలను బయటకు పంపే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. హుజురాబాద్ లోనూ టీఆరెస్ నేతలను బయటకు పంపే కుట్ర చేశారని ఆరోపించారు. తక్కువ టైంలో వేల కోట్లు, వందల ఎకరాలు ఎలా సంపాదించావని ప్రశ్నించారు. ఈటెల తనకు తాను ఎక్కువ ఉహించుకున్నాడని ఎద్దేవా చేశారు. ఈటెల ప్రతి ఒక్క ప్రతిపక్ష నేతలతో టచ్ లో ఉన్నాడని తెలిపారు. కేసీఆర్ బొమ్మతో ఈటల ఆరుసార్లు గెలిచాడని పేర్కొన్నారు. జమ్మికుంట-హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ లు కేటీఆర్ ను కలవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పార్టీలో తిరుగుబాటు తీసుకొచ్చేందుకు ఈట‌ల ప్ర‌య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న గౌర‌వానికి భంగం క‌ల‌గొద్ద‌ని పార్టీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదన్నారు. హుజురాబాద్‌లో బీసీల‌ను అణ‌గ‌తొక్కారని మండిపడ్డారు. త్వరలోనే హుజురాబాద్ లో పర్యటన చేస్తామని, పార్టీని మరీంత బలోపేతం చేస్తామని తెలిపారు.

కమలాపూర్ నియోజవర్గం ఈటెలకు బంగారు పళ్లెంలో కేసీఆర్ ఇచ్చారని టీఆర్ఎస్ సీనియర్ నేత బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈటెల ఫ్లోర్ లీడర్ ఇచ్చి అత్యున్నత స్థానం కేసీఆర్ కల్పించారని, రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్ కు ఈటల సవాల్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉంటూ నాయ‌కులు అసైన్డ్ భూముల జోలికి పోవ‌ద్దని పేర్కొన్నారు. అసైన్డ్ భూములను అమ్మ‌డానికి వీల్లేదు అని ప్ర‌భుత్వం చ‌ట్టం తీసుకొచ్చిందన్నారు. ఆ నిబంధ‌న‌ను ఉల్లంఘించ‌డం నేరం అని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల జోలికి పోవద్దని పేర్కొన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. 2001లోనే టీఆరెస్ పార్టీ కమలాపూర్ నియోజవర్గంలో బలంగా ఉందన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు టీఆరెస్ పార్టీని చాలా ఇబ్బంది పెట్టాడని వినోద్ చెప్పారు.  2001లో పంచాయ‌తీరాజ్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు రైతు నాగ‌లి గుర్తుపై పోటీ చేసి, నాటి ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌రిష‌త్‌ను కూడా కైవ‌సం చేసుకు్నామన్నారు. 2003లో ఈట‌ల టీఆర్ఎస్ పార్టీలో చేరారని, 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచారని తెలిపారు. ఎంతో మందిని వ‌దులుకుని ఈట‌ల‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారని వినోద్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement