Thursday, April 25, 2024

శారదా పీఠంలోకి వెళ్లిన ఘటనపై స్పందించిన నారాయణ

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో శారదా పీఠంలోకి వెళ్లిన తనకు ఆధ్యాత్మికతను అంటగట్టడంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే తాను అనుకోకుండా శారదా పీఠం లోపలకు వెళ్లానని, కానీ అక్కడి సిబ్బంది అపాయింట్‌మెంట్ అడిగారని.. తీరా తాను వచ్చిన విషయం స్వామిజీకి తెలిసి లోపలకు రమ్మనగానే వెళ్లానని తెలిపారు. కానీ ఈ విషయాన్ని పట్టుకుని తనకు భక్తి భావం అంటిందని కొందరు విమర్శలు చేస్తున్నారని.. తానేమీ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు పెట్టలేదని, పూలు, పండ్లు కూడా లోపలకు తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు.

తన కుటుంబ విషయానికి వస్తే తన ఇద్దరు పిల్లలు దండల పెళ్లిళ్లే చేసుకున్నారని.. అమ్మగారు చనిపోయినా అంత్యక్రియలు చేయకుండా బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించామని, కళ్లను ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు దానం చేశామని నారాయణ అన్నారు. ఇలాంటి ప్రధానమైన ఘట్టాల్లో లేని ఆధ్యాత్మిక తత్వం ఓటు అడగడానికి ఒక ఆశ్రమంలోకి వెళ్లగానే అబ్బుతుందా అని సూటిగా ప్రశ్నించారు. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది కానీ భూతద్దంలో అదే ప్రతిబింబం చాలా ఇబ్బందిగా కనిపిస్తుందన్నారు. అదే విధంగా తన తప్పులపై అన్వేషణ మంచిదే కానీ వక్రభాష్యం మంచిది కాదని విమర్శకులకు హితవు పలికారు. అటు గతంలో తాను గుళ్లకు వెళ్లి దర్శనాలు చేసుకున్నానని విమర్శించారని.. తాను సగటు మనిషిని కాబట్టి ఎవరైనా శుభకార్యాలు పిలిచినప్పుడు అక్కడికి వెళ్లాల్సి వస్తుందని.. అంతమాత్రానా తాను భక్తుడిని అయిపోతానా? దేవుడికి పూజలు చేసినట్లేనా అని నిలదీశారు. తన గురించి తెలిసినవారైనా, తెలియనివారైనా.. ఎవరో విమర్శించారని, ఏవేవో చూపించారు కాబట్టి అవన్నీ నిజాలు కాదని గ్రహించాలని నారాయణ కోరారు. తాను భక్తుడినే అని.. తన భక్తి తాను పనిచేస్తున్న పార్టీపైనే ఉంటుందని, తన మెడలో ఉండే ఎర్రజెండా తన ఊపిరిపోయేదాకా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement