ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడని.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణాష్టమి(Krishnashtami) జరుపుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే. రేపు ( శనివారం ) దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. జన్మాష్టమి రోజు చిన్ని కన్నయ్యను భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు వెన్నదొంగకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఇక కృష్ణాష్టమి సాయంత్రం జరిగే ఉట్టి కొట్టే ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అయితే, కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు పలు రకాల పూలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి కృష్ణుడు జన్మించాడు. ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో శ్రావణ బహుళ అష్టమి తిథి ఉంటుందో ఆ మరుసటి రోజు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవడం ఆనవాయితీ. ఆ ప్రకారంగా చూస్తే ఈ ఏడాది ఆగస్టు 16 శనివారం కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోనున్నారు. ఇక కృష్ణాష్టమినే “జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణిష (Janmashtami, Gokulashtami, Ashtami Rohini)అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నయ్య భక్తులంతా హరే కృష్ణ హరే కృష్ణ నామాన్ని స్మరిస్తూ భక్తి శ్రద్ధల(devotional devotion)తో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
పూజ ఇలా చేయండి..
శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి విగ్రహానికి పూలు, నెమలి ఈకలతో అందంగా అలంకరించాలి. అనంతరం పూజ ప్రారంభించాలి. గోపాలుడిని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండి నీళ్లతో కన్నయ్య పాదాల ముద్రలు వేయాలి. 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. గోవర్ధనధారికి ఇష్టమైన వెన్న, పండ్లు, పాలు, వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజించేటప్పుడు కృష్ణుడికి ఇష్టమైన నెమలి ఈక, వేణువు, వెన్న వంటివి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. గోమాత విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు. ఇవి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఇంటిని అందంగా అలంకరించుకోవాలి.
నీలం రంగు పువ్వులతో పూజిస్తే శుభ ఫలితాలు
జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడి(Sri Krishna)ని నీలం రంగు పువ్వులతో పూజిస్తే కృష్ణ భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే తులసి ఆకులు అన్నా కన్నయ్యకు ఇష్టం కాబట్టి జన్మాష్టమి నాడు స్వామి వారిని తులసి దళాలతో ఆరాధిస్తే స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు. ఇవే కాకుండా మరికొన్ని పువ్వులతో పూజించినా మంచి జరుగుతుందంటున్నారు. గోకులాష్టమి రోజు చిన్ని కృష్ణుడిని సంపంగి పూలతో పూజిస్తే శత్రు సమస్యలు తొలగిపోతాని సూచిస్తున్నారు. కన్నయ్యను జాజిపూలతో పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, మంచి పురోగతి లభిస్తుందని వివరిస్తున్నారు.కాలసర్ప దోషాలతో బాధపడేవారు అష్టమి రోజు కన్నయ్యను పారిజాత పూలతో ఆరాధించాలట. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న 12 రకాల కాల సర్ప దోషాలను తొలగించుకోవచ్చని చెబుతున్నారు. సువాసన భరితమైన మల్లెపూలు లేదా తెల్ల జిల్లేడుతో చిలిపి కిట్టయ్యను పూజిస్తే శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు. పద్మ పుష్పాలు లేదా పొద్దు తిరుగుడు పువ్వులతో కన్నయ్యను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి ధనవంతులవుతారని వివరిస్తున్నారు. నందివర్ధనం పుష్పాలతో పూజిస్తే జీవితంలో శాంతి, ప్రశాంతత లభిస్తాయని చెబుతున్నారు.
కన్నయ్యకు ఇష్టమైన నైవేద్యాలు
కృష్ణాష్టమి రోజు కన్నయ్యను మనసారా పూజించడంతో పాటు పలు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే ఎక్కువ మొత్తంలో ప్రసాదాలు చేయడం వీలుకానీ వారు కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, వెన్న, మినప సున్నుండలు, బెల్లం కలిపిన పెరుగు, జున్ను, మీగడ వంటివి సమర్పిస్తే ఆయన అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయంటున్నారు. అయితే ఏ నైవేద్యం సమర్పించినా దానిమీద తులసి దళాలు వేస్తే మరీ మంచిది.
ఈ రోజున ఇలా ఉండాలి..
- ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
- ఇతరులతో కఠినంగా ప్రవర్తించకూడదు. అందరితో మర్యాదగా మాట్లాడాలి.
- గోవులపై దయతో వ్యవహరించాలి. జంతువులకు ఆహార, పానీయాలు అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుంది.
- కృష్ణ జన్మాష్టమి రోజున తులసి ఆకులను తెంపకూడదు. ఎందుకంటే శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి మొక్క.
- చెట్లను కూడా నరకొద్దు.ఇలా చేస్తే అశుభం కలిగే ప్రమాదం ఉంది.
- కృష్ణాష్టమి రోజు మాంసం, మద్యం తీసుకోకూడదు. శాఖాహారమే తినాలి.
- భాగస్వామితో ప్రేమానురాగాలకు దూరంగా ఉండాలి.
- జంతువులకు హాని కలిగించకూడదు.
- ఎవరిపై కోప్పడకూడదు, ఎవ్వరినీ అగౌరపరచకూడదు.