బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) పాలనను లాంతర్ల యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఆ సమయంలో రాష్ట్రం అంధకారంలో, అన్యాయంలో, వెనుకబాటుతనంలో మునిగిపోయిందని ఆరోపించారు. బీహార్‌లోని గయాజీలో శుక్రవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం….. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ నేరచరిత్ర ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే బిల్లును వెనకేసుకొచ్చారు

“జైలులో ఉన్నవారు ప్రభుత్వాన్ని ఎలా నడపగలరు?” అని ప్రశ్నించారు. సాధారణ ఉద్యోగి కేవలం 50 గంటల పాటు జైలులో ఉంటే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. డ్రైవర్, క్లర్క్, అటెండర్ ఎవరు అయినా ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే ముఖ్యమంత్రి, మంత్రి లేదా ప్రధాని జైలులో ఉండి కూడా అధికారంలో కొనసాగడం సరైందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

గతంలో జైలు నుంచే ఉత్తర్వులు..

ప్రధాని మోదీ మాట్లాడుతూ, గతంలో జైలులో ఉన్న నేతలు ఫైళ్లపై సంతకాలు చేసి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో అవినీతిని ఎలా ఎదుర్కోవాలి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిందని మోదీ తెలిపారు. ఈ చట్టం ప్రకారం భవిష్యత్తులో ప్రధాని, ముఖ్యమంత్రి సహా ఎవరైనా జైలులో ఉంటే, 31వ రోజుకల్లా పదవి కోల్పోవాల్సిందే అని తెలిపారు. ఇకపై జైలు నుంచే ప్రభుత్వ పాలన కొనసాగడం అసాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

బీహార్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా గయాలో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. మొత్తం రూ.12 వేల కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టుల్లో, బక్సర్‌లో రూ.6,880 కోట్లతో నిర్మించిన 660 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

అలాగే గయాజీ – ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అదనంగా ఉత్తర బీహార్‌లోని వైశాలి – జార్ఖండ్‌లోని కొడెర్మాను కలిపే బౌద్ధ సర్క్యూట్ రైలుకు కూడా పచ్చజెండా చూపారు.

ఈ సందర్భంగా పీఎం ఆవాస్ యోజన కింద 12,000 గ్రామీణ లబ్ధిదారుల గృహప్రవేశం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

గంగానదిపై ఆసియాలోనే వెడల్పైన బ్రిడ్జి

ప్రధాని మోదీ గంగానదిపై నిర్మించిన ఆసియాలోనే అత్యంత వెడల్పైన ఆరు లేన్ల వంతెనను ప్రారంభించారు. రూ.1,870 కోట్ల వ్యయంతో, జాతీయ రహదారి-31పై నిర్మించిన ఈ 8.15 కి.మీ పొడవైన అవుంతా-సిమారియా బ్రిడ్జి ప్రాజెక్ట్లో భాగంగా, 1.8 కి.మీ పొడవైన కొత్త ఆరు లేన్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది.

ఈ కొత్త వంతెన పాట్నాలోని మోకామా – బెగుసరాయ్ మధ్య నేరుగా అనుసంధానాన్ని కల్పిస్తుంది. గతంలో “రాజేంద్ర సేతు” పేరిట ఉన్న పాత రైల్-కమ్-రోడ్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో భారీ వాహనాలు మరల్చబడి, అదనంగా 100 కి.మీలు ప్రయాణించాల్సి వచ్చేది.

కొత్త వంతెన ప్రారంభంతో, ఉత్తర బీహార్ – దక్షిణ బీహార్ మధ్య రాకపోకలు సులభమవుతాయి. వాహనదారుల ప్రయాణదూరం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తగ్గుతాయని అధికారులు తెలిపారు.

Leave a Reply