ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు (StockMarket) సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అస్పష్టత, కొన్ని కీలక రంగాల్లోని షేర్లపై అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ రంగాల సూచీలు భారీగా పతనమవడం మార్కెట్ మొత్తాన్ని దిగజార్చింది. ఈ రోజు ట్రేడింగ్లో సెన్సెక్స్ (Sensex) 570 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ (Nifty) 24,700 స్థాయిని కోల్పోయింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 86.66..
ఈ ఉదయం 81,299.97 పాయింట్ల వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రారంభ దశలో కొద్దిపాటి పుంజుకోలు కనబరిచింది. కానీ మధ్యాహ్నం తరువాత మార్కెట్ మరింతగా పతనమవుతూ ఇంట్రాడేలో 80,776.44 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరికి 572.07 పాయింట్లు నష్టపోయి 80,891.02 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 156.10 పాయింట్ల నష్టంతో 24,680.90 వద్ద స్థిరమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 14 పైసలు తగ్గి 86.66గా ముగిసింది. ఫార్మా రంగాన్ని మినహాయిస్తే మిగతా అన్ని రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడితో పడిపోయాయి.
సుమారు 3శాతం తగ్గిన మీడియా సూచీ…
రియల్టీ సూచీ ఒక్కరోజే 4 శాతం వరకు పతనమవగా,మీడియా సూచీ సుమారు 3 శాతం తగ్గింది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు, లోహ, టెలికాం రంగాల సూచీలు 1 నుండి 1.5 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, హీరో మోటోకార్ప్,ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్ వంటి కంపెనీల షేర్లు మంచి ప్రదర్శన కనబరిచాయి. మరోవైపు, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా త్రైమాసిక ఫలితాల ప్రభావంతో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర దాదాపు 7.34 శాతం క్షీణించింది. టీసీఎస్ షేర్లు 1.59 శాతం నష్టపోయాయి.