Thursday, April 25, 2024

యూఎస్‌ ఓపెన్‌ విజేత స్వియాటెక్‌.. చరిత్ర సృష్టించిన పోలండ్‌

ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్‌ 2022 టోర్నీలో భాగంగా మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ సంచలనం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆర్ధర్‌ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్‌ ఫైనల్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించి ట్యునీషియాకు చెందిన ఆన్స్‌ జబీర్‌ను 6-2, 7-6(7-5) తేడాతో ఓడించి తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అలాగే ఈ ట్రోఫీని ముద్దాడిన తొలి పోలండ్‌ క్రీడాకారిణిగానూ చరిత్ర సృష్టించింది. దీంతో స్వియాటెక్‌ తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. స్వియాటెక్‌ 2020, 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా 2016 తర్వాత ఒకే సీజన్‌లో రెండు గ్రాండ్‌ స్లామ్‌లను గెలుచుకున్న మొదటి మహిళగా 21ఏళ్ల స్వియాటెక్‌ నిలిచింది. ఇగా స్వియాటెక్‌ కెరీర్‌లో ఇది 10వ టైటిల్‌ కావడం విశేషం.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే… తొలి సెట్‌లో కేవలం 8 నిముషాల వ్యవధిలోనే స్వియాటెక్‌ 3-0తో ఆధిక్యం సాధించింది. జబీర్‌ పుంజుకుని స్కోరును 3-2కు తీసుకొచ్చింది. అయితే జబీర్‌ సర్వీస్‌ గేమ్‌లో మళ్లి నిరాశ పరిచింది. ఇక స్వియాటెక్‌ 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లి 6-2తో సెట్‌ కైవసం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో జబీర్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్వియాటెక్‌కు గట్టిపోటీనిచ్చింది. 4-4తో స్కోరు సమం కాగా… మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠగా సాగింది. గేమ్‌ 5-6 పాయింట్లు 30-40 వద్ద ఉన్నప్పుడు హైడ్రామా జరిగింది. ఒక మ్యాచ్‌ పాయింట్‌తో పోరాడి 6-6తో మ్యాచ్‌ హోల్డ్‌ అయింది. ఇక చివరి 7-6తో సెట్‌ స్వియాటెక్‌ సెట్‌ గెలుపొందిం. టై బ్రేక్‌లో (7/5)తో స్వియా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది. ఆఫ్రికా తరఫున గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన మొదటి మహిళగా అవతరించాలని చూస్తున్న జబీర్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ ఓపెన్‌లో కూడా సత్తా చాటింది.

కానీ చివర్లో ఓటములను ఎదుర్కొంది. తాజా ఓటమి ఆమెను మరింత బాధించకతప్పదు. ఈ విజయంతో స్వియాటెక్‌ 2013 తర్వాత ఒకే సీజన్‌లో రెండు గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు దక్కించుకుంది. స్వియాటెక్‌ రోలండ్‌ గారస్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌), యూఎస్‌ ఓపెన్‌లను సొంతం చేసుకుంది. 2013లో సెరీనా విలియమ్స్‌ ఈ ఘనత సాధించింది.
ఇక వీల్‌చైర్‌ జూనియర్‌ గర్ల్స్‌ డబుల్స్‌ చాంపియన్స్‌గా మేలీ ఫీల్ప్స్‌- జాడే మోరియిరా లనాయి, వీల్‌చైర్‌ జూనియర్‌ బాయ్స్‌ డబుల్స్‌ చాంపియన్స్‌గా బెన్‌ బర్త్‌రామ్‌- డహ్నూన్‌ వార్డ్‌, వీల్‌చైర్‌ ఉమెన్స్‌ డబుల్స్‌ చాంపియన్స్‌గా అనీక్‌ వాన్‌ కూట్‌ డైడి డి గ్రూట్‌, వీల్‌చైర్‌ క్వాడ్‌ డబుల్స్‌ చాంపియన్స్‌గా నీల్స్‌ వింక్‌- శామ్‌ స్కోరోడర్‌, జూనియర్‌ గర్ల్స్‌ డబుల్స్‌ చాంపియన్స్‌గా డయానా స్నయిడర్‌ లూసి హవ్లికోవ నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement