Wednesday, November 29, 2023

Spl Story | నాటి స్టార్‌ ప్లేయర్లు, నేటి చీఫ్‌ కోచ్‌లు.. ఐపీఎల్​ కోసం అంతా రెడీ!

ఐపీఎల్‌ సందడిలో ఆటగాళ్లు తెరముందు హీరోలైతే, చీఫ్‌ కోచ్‌లు తెరవెనుక హీరోలు. ఆటగాళ్ల సామర్థ్యానికి సానబెట్టడం నుంచి ప్రత్యర్థి ప్లేయర్ల బలహీనతల్ని గుర్తించడం, మైదానంలో పరిస్థితుల్ని బట్టి ఆటగాళ్లను అప్రమత్తం చేయడం, వ్యూహాలను వేగంగా మార్చేలా చేయడం తద్వారా జట్టును విజయపథంలో పరుగెత్తించడం వరకు విభిన్న లక్ష్యాలకోసం చీఫ్‌కోచ్‌లు అత్యంత కీలకం. 2023 సీజన్‌లోను మేటి ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీల తరఫున కీలక బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో చాలా వరకు మాజీ మేటి క్రికెటర్లే కావడం విశేషం. అలనాటి స్టార్‌ ప్లేయర్లు నేటి ప్రధాన కోచ్‌లైన వారి గురించి తెలుసుకుందాం…

- Advertisement -
   

స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌
న్యూజీలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆటగాడిగా ఇక్కడి నుంచే ప్రస్తానం ప్రారంభించారు. ఇప్పుడు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2008 ప్రారంభ లీగ్‌లో సీఎస్‌కేకు ఆడిన ఫ్లెమింగ్‌ 2009లో రిటైర్‌ అయ్యాడు. అప్పటి నుంచి హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఫ్లెమింగ్‌ హయాంలో సీఎస్‌కే 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్‌ విజతేగా నిలిచింది. రెండు సీజన్లకు చెన్నై సూపర్‌కింగ్స్‌ సస్పెండ్‌ అయిన సందర్భంలో, రైజింగ్‌ పుణ సూపర్‌ జెయింట్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 111 టెస్టులు, 280 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. 15వేలకుపైగా పరుగులు చేసాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.

బ్రియాన్‌ లారా : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్లలో ఒకరైన బ్రియాన్‌లారా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గత సీజన్‌లో బ్యాటింగ్‌ కోచ్‌గాను, సలహాదారుగాను ఉన్నాడు. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఎస్‌ఆర్‌హెచ్‌ను విజేతగా నిలపడం లారా ముందున్న కర్తవ్యం. 2016లో టైటిల్‌ విజేతగా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆ తర్వాత అంతగా రాణించలేదు. గత సీజన్‌లో 10 జట్ల జాబితాలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. అంతకు ముందు ఏకంగా అట్టడుగున నిలిచింది. ఈసారి హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్‌గా మార్‌క్రమ్‌ వచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ను తిరిగి విజయాల బాటలో నడిపించడంలో వీరిద్దరు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది. మైదానం వెలుపల లారా వ్యూహాలు, మైదానంలో మార్‌క్రమ్‌ సమయస్ఫూర్తి ఏమేరకు ఫలిస్తాయన్నది ఆసక్తికరం. లారా కెరీర్‌ విషయానికొస్తే, 131 టెస్టులు, 299 వన్డేలు ఆడాడు. 22 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 53 సెంచరీలు ఉన్నాయి.

మార్క్‌ బౌచర్‌: ముంబై ఇండియన్స్‌
దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా మార్క్‌బౌచర్‌ క్రికెట్‌ అభిమానులకు చిరపరిచితుడు. 2023 సీజన్‌కు ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా కొత్త బాధ్యతల్లోకి వచ్చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌ 2016 ఎడిషన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఆటగాడిగా కేకేఆర్‌, ఆరీసీబీ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంటర్నేషనల్‌ కెరీర్‌ విషయానికొస్తే, 46ఏళ్ల బౌచర్‌ 147 టెస్టులు, 295 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. 6 సెంచరీల సహాయంతో 10 వేకు పైగా పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌, ఫీల్డర్‌గా 900కిపైగా క్యాచ్‌లు అందుకున్నాడు. 46 మందిని స్టంపౌట్‌ చేశాడు.

రికీ పాటింగ్‌ : ఢిల్లి క్యాపిటల్స్‌
అంతర్జాతీయ క్రికెట్‌లోను, ఆస్ట్రేలియా జట్టులో ప్రముఖ ఆటగాడిగా గుర్తింపు పొందిన రికీపాంటింగ్‌, 2018 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లిd ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. జట్టులో పోటీతత్వాన్ని పెంచడంలోను, ఆటగాళ్లను తీర్చిద్దడంలోనూ రికీ విశేష కృషిచేశాడు. కానీ ఆ సీజన్‌లో ఢిల్లిd క్యాపిటల్స్‌ ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. తన సారథ్యంలోనే శ్రేయాస్‌అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ వంటి వర్ధమాన క్రికెటర్లకు సానబెట్టాడు. 2019 సీజన్‌లో మూడవ స్థానంలో నిలిచిన ఢిల్లిd, 2020లో రన్నరప్‌గాను, 2021లో మూడవ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. పటిష్టమైన జట్టుగా పేరొందినప్పటికీ, టైటిల్‌ వేటలో ఢిల్లిdకి నిరాశే మిగిలింది. ఈసారి ఆ లోటను భర్తీ చేయాలనే పట్టుదలతో ఉంది. పాంటింగ్‌ విషయానికొస్తే, 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 27వేలకు పైగా పరుగులు సాధించాడు. సచిన్‌, కోహ్లీ తర్వాత 71 సెంచరీలతో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జాబితాలో ఉన్నాడు. తన కెప్టెన్సీలో 2003, 2007లో ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్‌ను సాధించిపెట్టాడు. 1999 ప్రపంచకప్‌ విన్నింగ్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆల్‌టైమ్‌ అంతర్జాతీయ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.

ఆశిష్‌ నెహ్రా : గుజరాత్‌ టైటాన్స్‌
టీమిండియా మాజీ బౌలర్‌.. గత సీజన్‌లో హీరోగా తెరపైకి వచ్చాడు. ఐపీఎల్‌ టైటిల్‌ విన్నింగ్‌ టీమ్‌కి హెడ్‌ కోచ్‌గా కొత్తపాత్రలో రాణించాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, నెహ్రా ఆధ్వర్యంలో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదే గుజరాత్‌ కప్పును సొంతం చేసుకుంది. ఆటగాడిగా, కోచ్‌గాను అంతకు ముందు వివిధ జట్లకు నెహ్రా సేవలు అందించాడు. 2018, 2019 సీజన్‌లో ఆర్‌సీబీకి బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. డిల్లిd, హైదరాబాద్‌, పుణ, ముంబై, చెన్నై జట్లకు బౌలింగ్‌ సేవలు అందించాడు. అంతర్జాతీయ బౌలర్‌గా, 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20లు ఆడాడు. 200కిపైగా వికెట్లు తీశాడు. 2003 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇంగ్లండ్‌పై 6/23 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లోను సభ్యుడు. 2017లో రిటైర్‌ అయ్యాడు.

ఆండీ ఫ్లవర్‌: లక్నో సూపర్‌ జెయింట్స్‌
54 ఏళ్ల జింబాబ్వే అలనాటి మేటి బ్యాటర్‌ ఆండీఫ్లవర్‌ అంతర్జాతీయ ఉత్తమ క్రికెటర్లలో ఒకడు. 2020, 2021 ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు సహాయక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. గత సీజన్‌లో కొత్తగా ఏర్పాటైన లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జి)కి ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఐసీసీ హాల్‌ఆఫ్‌ ఫేమ్‌ ప్లేయర్‌ అయిన ఫ్లవర్‌ కోచింగ్‌ నాయకత్వంలో ఎల్‌ఎస్‌జి గతేడాది మూడవ స్థానంలో నిలిచింది. ఈసారి మరో అడుగు ముందుకు వేయాలని కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, కోచ్‌ ఆండీఫ్వవర్‌ పట్టుదలతో ఉన్నారు. గతంలో ఇంగ్లండ్‌ జట్టుకు కోచింగ్‌ బాధ్యతలు చేపట్టి, టెస్టుల్లో ఆ జట్టును నంబర్‌వన్‌గా నిలిపాడు. 2010 టీ20 ప్రపంచకప్‌ గెలుపు, ఆస్ట్రేలియాపై యాషెస్‌ విజయాల్లోనూ ఫ్లవర్‌ కీలకంగా వ్యవహరించాడు. దాదాపు 12 ఏళ్లపాటు ఇంగ్లీషు జట్టుకు సేవలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 63 టెస్టులు, 213 వన్డేలు ఆడిన ఆండీ 11వేలకు పైగా పరుగులు సాధించాడు. వికెట్‌ కీపర్‌గా 290 క్యాచ్‌లు, 40 స్టంపింగ్‌లు చేశాడు.

కుమార సంగక్కర: రాజస్థాన్‌ రాయల్స్‌
శ్రీలంక మాజీ మేటి బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ అయిన కుమార సంగక్కర రాజస్థాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘంగా సేవలు అందిస్తున్నాడు. క్రికెట్‌ డైరెక్టర్‌గాను, ప్రధాన కోచ్‌గాను బహుముఖాభినయం చేస్తున్నాడు. ఆటగాడిగా ఐదు సీజన్లలో పాల్గొన్నాడు. డెక్కన్‌ చార్జర్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. సన్‌రైజర్‌ ్స హైదరాబాద్‌కు కెప్టెన్‌గాను వ్యవహరించాడు. ఐసీసీ హాల్‌ఆఫ్‌ఫేమ్‌లోను చోటు దక్కించుకున్నాడు. 2014 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. టీ20, వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌ చేరిన నాలుగు సార్లు కూడా సంగక్కర జట్టు సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 134 టెస్టులు, 404 వన్డేలు, 56టీ20లు ఆడాడు. 27వేలకుపైగా పరుగులు చేశాడు. 63 సెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 600 క్యాచ్‌లు, 130 స్టంపింగ్స్‌ చేశాడు.

చంద్రకాంత్‌ పండిట్‌ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌
మన దేశవాళీ క్రికెట్‌లో బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గా గుర్తింపు పొందిన కొద్దిమంది ఆటగాళ్లలో చంద్రకాంత్‌ పండిట్‌ ఒకరు. 2021-22 సీజన్‌లో సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ రంజీ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా పనిచేశాడు. టైటిల్‌ సాధించేలా జట్టును విజయపథంలో నడిపించాడు. మొత్తంగా ఆరు రంజీ ట్రోఫీ విజేత టీమ్‌లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఈసీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చీఫ్‌ కోచ్‌గా వ్వహరిస్తున్నాడు. బ్రండన్‌ మెక్‌ కల్లమ్‌ స్థానంలో కీలక బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ నెగ్గిన కేకేఆర్‌ను మూడోసారి విజేతగా నిలిపేందుకు ఆయన కృషి చేస్తున్నాడు. గత ఎనిమిది సీజన్లలో కేకేఆర్‌ టైటిల్‌కు దూరంగా ఉండిపోయింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన కేకేఆర్‌ను తక్షణమే విజయాల బాట పట్టించడం పండిట్‌ ముందున్న లక్ష్యం. పండిట్‌ తన కెరీర్‌లో భారత జట్టు తరఫున 5 టెస్టులు, 36 వన్డేలు ఆడాడు. 400కిపైగా పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌గా 29క్యాచ్‌లు, 17 స్టంపింగ్స్‌ చేశాడు.

సంజయ్‌ బంగర్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
టీమిండియా మాజీ ప్లేయర్‌ అయిన సంజయ్‌బంగర్‌, ఐపీఎల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌, కేకేఆర్‌ తరఫున ఆడాడు. 2010 సీజన్‌ నుంచి బ్యాటింగ్‌ కోచ్‌ బాధ్యతల్లోకి ప్రవేశించాడు. 2014 సీజన్‌లో కింగ్స్‌పంజాబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఆసీజన్‌లో పంజాబ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2016లో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత పురుషుల జట్టుకు చీఫ్‌ కోచ్‌గాను పనిచేశాడు. విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ వంటి హేమాహేమీలకు బ్యాటింగ్‌ కోచ్‌గా మెళకువలు నేర్పాడు. 2021లో ఆర్సీబీకి చీఫ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. గత 15 సీజన్లలోపాల్గొన్న ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గలేదు. ఈసారి ఆ లోటును భర్తీచేసుకుని రికార్డు సృష్టించాలని బంగర్‌ చూస్తున్నాడుు. అంతర్జాతీయ కెరీర్‌లో 12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన బంగర్‌, 650 పరుగులు చేశాడు. ఇందులో ఓ టెస్టు సెంచరీ కూడా ఉంది. కుడిచేతి సీమర్‌గా 14 వికెట్లు పడగొట్టాడు.

ట్రివోర్‌ బేలిస్‌ : పంజాబ్‌ కింగ్స్‌

లక్కీ కోచ్‌గా పేరొందిన వారిలో ట్రివోర్‌ బేలిస్‌ ఒకరు. ఈయన ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇతని సారధ్యంలో 2012, 2014, 2015లో కేకేఆర్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌ పురుషుల జట్టుకు కూడా చీఫ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఇంగ్లండ్‌ 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ నెగ్గడంలో ఆయన కృషి మరువలేనిది. ఇప్పుడు పంజాబ్‌ కోచ్‌గా, ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ లోపాలను సవరించాల్సి ఉంది. శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీలో పంజాబ్‌ జట్టు పేపర్‌ పులిగా కనిపిస్తుంది. ఇంత వరకు ఒక్క టైటిల్‌ కూడా నెగ్గని పంజాబ్‌కు ట్రివోర్‌ బేలిస్‌ లక్కీ హ్యాండ్‌ కలిసొస్తుందని ఆశిద్దాం. తన కెరీర్‌లో న్యూ సౌత్‌వేల్స్‌ తరఫున 58 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement