కేంద్రప్రభుత్వం వైఖరికి నిరసగా, తమ పతకాలను గంగానదిలో కలిపేందుకు సిద్ధమైన రెజ్లర్లు వెనక్కితగ్గారు. బీకేయూ రైతుసంఘం నాయకుడు రాకేశ్ తికాయత్, స్థానికుల విజ్ఞప్తి మేరకు రెజ్లర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు కేంద్రానికి 5 రోజుల గడువు విధించారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఉదయం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించినట్లుగానే సాక్షిమాలిక్, వినేశ్ ఫొగాట్, సంగీత తదితర రెజ్లర్లు గంగానది ఒడ్డున ఉన్న హర్‌కీ పౌరీ ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్లు వస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న పోలీసులు భద్రతాచర్యలు చేపట్టారు.
మరోవైపు పెద్ద ఎత్తున మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గంగానది ఒడ్డుకు చేరుకున్న రెజ్లర్లు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దాదాపు 20 నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రాణసమానమైన పతకాలను నిమజ్జనం చేయాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతలో రైతునాయకుడు రాకేశ్ తికాయత్ అక్కడకు చేరుకుని వారికి మద్దతు పలికారు. కొన్నేళ్లు కష్టపడి దేశంకోసం సాధించిన పతకాల్ని నిమజ్జనం చేయడం సరికాదని నచ్చజెప్పడంతో రెజ్లర్లు శాంతించారు. తమవద్ద ఉన్న పతకాలను తికాయత్‌కు అప్పగించారు. న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు.
‘మే 28న జరిగిన పరిణామాలను అందరూ చూశారు. శాంతిపూర్వకంగా నిరసన చేపడుతున్న మాపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పైగా మాపైనే కేసు బనాయించారు. మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం తప్పా? దేశం తరఫున తాము పతకాలు ఎందుకు సాధించామా? అని అనిపిస్తోంది. ఇప్పుడు వాటికి అర్థం లేకుండా పోయింది. వాటిని తిరిగి ఇవ్వడం మరణంతో సమానం. కానీ, ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం కష్టం. రాష్ట్రపతి, ప్రధానికి పతకాలను తిరిగి ఇచ్చేద్దామన్నా.. మనసు ఒప్పుకోవడం లేదు. వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు’ అని రెజ్లర్ బజరంగ్ పునియా మంగళవారం ఉదయం చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.