Friday, March 29, 2024

కోహ్లీ గురించి మాట్లాడే అర్హత ఉందా..? : సల్మాన్ బట్

ఇం‍గ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌పై పాక్‌ మాజీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ సల్మాన్‌ బట్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కొద్ది రోజుల కిందట టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని న్యూజిలాండ్‌ సారధి కేన్‌ విలియమ్సన్‌తో పోలుస్తూ వాన్‌ తెరలేపిన చర్చపై బట్‌ మండిపడ్డాడు. విలియమ్సన్‌ భారత్‌లో జన్మించి ఉంటే కోహ్లిని వెనక్కు నెట్టి ప్రపంచపు అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిచేవాడని వాన్‌ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేని వాన్‌ అర్ధరహితమైన చర్చలకు తెరలేపుతూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడంటూ చురకలంటించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు నమోదు చేసి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌, పాంటింగ్‌ తర్వాత మూడో స్థానంలో నిలిచిన కోహ్లిని ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టాడు.ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్లలో ఒకరైన కోహ్లి గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లికి మించిన ఆటగాడు లేడని, ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమన్నాడు. రికార్డుల పరంగా చూసినా కోహ్లి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని, అలాంటప్పుడు అతన్ని సమకాలీకులతో పోల్చడం సమంజసం కాదని అభిప్రాయడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement