Saturday, April 20, 2024

విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ రెడీ..

భారతజట్టు వైట్‌బాల్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ విండీస్‌తో జరగనున్న సిరీస్‌లో ఆడనున్నాడు. వెస్టిండీస్‌తో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా 6మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 6నుంచి జరిగే సిరీస్‌ మొదలుకానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. విండీస్‌తో తలపడే జట్టును సెలక్షన్‌ కమిటీ ఈవారంలో ఎంపిక చేయనుంది. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన మూడువన్డేల సిరీస్‌ను భారతజట్టు 3-0తో ఓడిపోయిన నేపథ్యంలో కొంతమంది సీనియర్‌ ప్లేయర్లుపై వేటు పడనుంది. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌కుమార్‌తోపాటు వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టుకు ఎంపిక చేస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అయితే గాయంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన రోహిత్‌శర్మ కోలుకున్నాడు.

ఫిట్‌నెస్‌ సాధించడంతో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం టీ20 సిరీస్‌ ఫిబ్రవరి 16నుంచి 20వరకు కోల్‌కతా వేదికగా జరగనుంది. రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌ సాధించాడని వెస్టిండీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. తొడకండరాల గాయంతో దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్‌శర్మ దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో ప్రాక్టీస్‌ చేస్తున్న రోహిత్‌శర్మ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి విచ్చేసిన ఫిట్‌నెస్‌ టెస్టులో పాల్గొంటాడని బీసీసీఐ అధికారి తెలిపారు.

టెస్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌..
భారతజట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌శర్మ ఇక నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని సమాచారం. అయితే ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా వరుసగా ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో..వర్క్‌లోడ్‌ విషయాన్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకుని ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తుంది. కేఎల్‌ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినా అంచనాల మేరకు రాణించలేకపోయాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా రాణించాలంటే మరింత సమయం పట్టనుండటంతో అతడిని రోహిత్‌ డిప్యూటీగానే కొనసాగించనున్నారు.దక్షిణాఫ్రికాలో కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారతజట్టు ఓటమిపాలైంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు కేఎల్‌ రాహుల్‌ సారథిగా వ్యవహరించనుండటంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది. కాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ జట్టులోకి పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హర్దిక్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ ఆరో నంబర్‌ స్థానంలో ఆకట్టుకోలేకపోవడంతో హార్దిక్‌ వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పునరాగమనం చేసే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement