Thursday, April 18, 2024

జార్ఖండ్‌ షూటర్‌ కొనికా లాయక్‌ ఆత్మహత్య.. జాతీయస్థాయిలో రాణించలేక కుంగుబాటుతో..

కోల్‌కతా: జార్ఖండ్‌కు చెందిన వర్ధమాన మహిళా షూటర్‌ కొనికా లాయక్‌ (26) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. భారత షూటర్‌ సీరత్‌ కౌర్‌ చనిపోయిన వారంరోజుల వ్యవధిలోనే కొనికా బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్‌లోని దన్‌బాద్‌కు చెందిన కొనికా లాయక్‌ కోల్‌కతాలోని బాల్లిd ఏరియాలోని అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొనికా హౌరాలో హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. కొనికా చేతిరాతతో లభించిన లేఖలో ఆమె ఆశించినమేరకు జాతీయస్థాయిలో మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులను క్షమించాలని ఆమె లేఖలో పేర్కొంది.

కొనికా ఆత్మహత్యపై కేసును నమోదు చేసిన పోలీసులు ఆ లేఖ ఆమె రాసిందా అనేది ధ్రువీకరించేందుకు అనాల్సిస్‌కు పంపినట్లు తెలిపారు. కొనికా లాయక్‌ ఆత్మహత్య గురించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా కొనికా తన కెరీర్లో రాష్ట్రస్థాయిలో నాలుగు బంగారు పతకాలతోపాటు ఓ రజత పతకాన్ని సాధించింది. ఇటీవల ఆమె జాతీయస్థాయి పోటీలకు ఆర్హత సాధించలేకపోయిందని కోచ్‌ కర్మాకర్‌ తెలిపాడు. ఫిబ్రవరిలోనే ఆమె వివాహం జరగనుంది. ఈలోగా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలియదని కోచ్‌ కర్మాకర్‌ పేర్కొన్నాడు.

2.70లక్షలతో రైఫిల్‌ కొనిచ్చిన సోనూసూద్‌
జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొనడానికి తన దగ్గర రైఫిల్‌ లేదని… దాన్ని కొనడానికి తనకు ఆర్థిక స్థోమత లేదని సోషల్‌మీడియా వేదికగా జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, క్రీడాశాఖతోపాటు సోనూసూద్‌కు కొనికా తెలపడంతో ఆమె వార్తల్లోకి ఎక్కింది. దీనిపై స్పందించిన ప్రముఖ భారతీయ నటుడు సోనూసూద్‌ ఈ ఏడాది మార్చి 24న 2.70లక్షల వ్యయంతో జర్మన్‌ తయారీ రైఫిల్‌ను అందజేశాడు. ఇక నుంచి శ్రద్ధగా ప్రాక్టీస్‌ చేసి రాణించాలని ఆమెతో సోనూసూద్‌ వీడియో కాల్‌ చేసి ప్రోత్సహించాడు. కొనికా కోల్‌కతాలోని ఒలింపియన్‌, అర్జున అవార్డు గ్రహీత జాయ్‌దీప్‌ కర్మాకర్‌ షూటింగ్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది. 2012 లండన్‌ ఒలింపియన్‌ కర్మాకర్‌ ఈ అకాడమీని నిర్వహిస్తున్నాడు.

కొనికా ఆత్మహత్యపై కర్మాకర్‌ మాట్లాడుతూ ఆమె మరణానికి సరైన కారణం తెలియదని మీడియాకు తెలిపాడు. డిసెంబర్‌ 13న కొనికా చిత్తరంజన్‌లో జరిగిన తన హాస్టల్‌మేట్‌ వివాహనికి హాజరై డిసెంబర్‌ 14న హాస్టల్‌కు తిరిగి వచ్చిందని తెలిపాడు. ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉండే కొనికా అకాడమీలో జరిగిన విశ్వకర్మ పూజావేడుకలకు స్వచ్ఛందంగా హాజరైందని కర్మాకర్‌ వెల్లడించాడు. వివాహానికి హాజరైన కొనికా వారంరోజులపాటు శిక్షణకు దూరమైందని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆగస్టులో అహ్మదాబాద్‌లో జరిగిన జీవీ మౌలాంకర్‌ టోర్నీలో షూటింగ్‌ టార్గెట్‌ను కొనికా టాంపరింగ్‌ చేసిందనే ఆరోపణలు రుజువు కావడంతో టోర్నీ నుంచి అనర్హురాలిగా ప్రకటించారు. టోర్నీ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆమె తప్పుచేసినట్లు బలవంతంగా పేపరుపై సంతకం చేయించుకున్నారని తెలిపిందని కర్మాకర్‌ వివరించాడు.

నాలుగు నెలల్లో నలుగురు షూటర్లు ఆత్మహత్య..
గత నాలుగు నెలల వ్యవధిలో నలుగురు షూటర్లు బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం పంజాబ్‌కు చెందిన 17ఏళ్ల షూటర్‌ సీరత్‌ కౌర్‌ తన లైసెన్సెడ్‌ పిస్టల్‌తో షూట్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీరత్‌ అక్టోబర్‌లో జరిగిన జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడింది. సీరత్‌కు ముందు పంజాబ్‌కే చెందిన హునర్‌దీప్‌ సింగ్‌, మొహాలీకి చెందిన నమన్‌వీర్‌ సింగ్‌ బ్రార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ప్రాక్టీస్‌ చేసేందుకు అవసరమైన సాధన సామగ్రి లేకపోవడం వల్లనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా అనే ప్రశ్నకు కర్మాకర్‌ బదులిస్తూ గతంతో పోలిస్తే ప్రస్తుతం జాతీయస్థాయి షూటర్లుకు గన్స్‌ను దిగుమతి చేసుకోవడం పదింతలు సులభమైందని తెలిపాడు. షూటింగ్‌లో రాణిస్తున్న షూటర్లకు ఆర్థిక సహకారం కూడా లభిస్తుందని..షూటర్లు ఆత్మహత్యకు పాల్పడటానికి వేరే కారణాలు ఉండొచ్చని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement