Thursday, April 18, 2024

ఆండర్సన్‌ రికార్డు..

వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ ద్వారా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్‌ల (161 టెస్ట్‌లు) రికార్డును ఆండర్సన్‌ అధిగమించాడు. కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌ అతని కెరీర్‌లో 162వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఓవరాల్‌గా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆండర్సన్‌ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్‌ 200 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో, ఆసీస్‌ మాజీ కెప్టెన్లు పాంటింగ్‌, స్టీవ్‌ వా 168 మ్యాచ్‌లతో రెండో స్థానంలో, 166 మ్యాచ్‌లతో కలిస్‌(దక్షిణాఫ్రికా) థర్డ్‌ ప్లేస్‌లో, 164 టెస్ట్‌లతో చంద్రపాల్‌(వెస్టిండీస్‌), ద్రవిడ్‌(భారత్‌) నాలుగో స్థానంలో ఉన్నారు.

కాగా, ఆండర్సన్‌.. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు(616) పడగొట్టిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ (708), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619) ఉన్నారు. 38 ఏళ్ల ఆండర్సన్‌ ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement