Tuesday, April 23, 2024

నేటి నుంచి ఐపీఎల్–2021… ముంబైతో బెంగళూరు ఢీ!

ఐపీఎల్‌ ఆటకు వేళయింది.  క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021 సీజన్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెపాక్‌లో ఢీకొట్టబోతున్నాయి. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ మొత్తం 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండగా.. ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు రూపంలో ఆరు సిటీలు టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. రాత్రి 7.30 గంటలకి మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఏటా.. డిఫెండింగ్ ఛాంపియన్‌, రన్నరప్ మధ్య జరగడం ఆనవాయితీ. అయితే.. ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయితో.. ఢిల్లీ క్యాపిటల్స్ (రన్నరప్) కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ మ్యాచ్‌లో తలపడబోతోంది. గత ఏడాది ఆర్సీబీ ఎలిమినేటర్‌లో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్ మొదటి మ్యాచ్ చెన్నైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. 


టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా ఈసారి ఆరు వేదికల్లోనే మ్యాచ్‌లు జరుగుతుండటంతో.. ఏ జట్టుకీ తన సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోయింది. ఏప్రిల్ 9 నుంచి మే 23 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆ తర్వాత మే 25 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ప్లేఆఫ్‌ మ్యాచ్‌లన్నింటికీ అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 25న క్వాలిఫయర్-1, 26న ఎలిమినేటర్, 28న క్వాలిఫయర్-2, 30న ఫైనల్ జరగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించబోమనిబీసీసీఐ తెలిపింది.

గతానికి భిన్నంగా మనదేశంలో జరిగే ఐపీఎల్‌ పోటీలను మన వెళ్లి చూడలేని పరిస్థితి నెలకొంది. అయితే, వైరస్‌ వల్ల ప్రత్యక్షంగా చూడలేకపోయినా… బుల్లితెరల్లోనే కనిపిస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా  క్రికెట్ అభిమానులంతా టీవీలకే అతుక్కుపోనున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement