Thursday, April 25, 2024

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2021.. భారత్‌ చేతిలో థాయ్‌ చిత్తు

ప్ర‌భ‌న్యూస్ : ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2021 తొలి మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక నాలుగోస్థానం సాధించిన తర్వాత భారత మహిళల జట్టుకు ఇదే తొలి మ్యాచ్‌. భారత్‌ సునాయాస విజయంలో డ్రాగ్‌ఫ్లికర్‌ గుర్జిత్‌కౌర్‌ 5గోల్స్‌తో కీలకపాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు గోల్స్‌ చేసిన గుర్జిత్‌ ఈ మ్యాచ్‌ రెండో నిమిషంలోనే గోల్‌చేసి 1-0ఆధిక్యాన్ని అందించింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణి వందన కటారియా ఐదు నిమిషాల అనంతరం రెండో గోల్‌ చేసింది. మొదటి క్వార్టర్‌ ముగిసే సమయానికి లిలిమా 14వ నిమిషంలో, గుర్జిత్‌కౌర్‌, జ్యోతి 14, 15వ నిమిషాల్లో పెనాల్టి కార్నర్‌ల ద్వారా మరో రెండు గోల్స్‌ చేసి భారత్‌కు 5-0ఆధిక్యాన్ని అందించారు.

రెండో క్వార్టర్‌ ఆరంభంలో అరంగేట్ర క్రీడాకారిణి రాజ్‌విదర్‌ కౌర్‌16వ నిమిషంలో, 24వ నిమిషంలో గుర్జిత్‌ తన మూడో గోల్‌ను సాధించింది. ఈ క్రమంలో రెండో క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌కు 9-0 ఆధిక్యం లభించింది. మూడో క్వార్టర్‌ మొదటి ఆరు నిమిషాలు థాయ్‌ డిఫెండ్‌ చేసినా భారత్‌ ముందు నిలవలేకపోయింది. జ్యోతి 36వ నిమిషంలో మరో ఫీల్డ్‌ గోల్‌ సాధించడంతో భారత్‌ ఆధిక్యం 10గోల్స్‌కు పెరిగింది. 43వ నిమిషంలో సోనిక, 55వ నిమిషంలో మోనిక గోల్స్‌ చేయగా మూడు నిమిషాల తర్వాత గుర్జిత్‌ తన ఐదో గోల్‌ చేయడంతో భారత్‌ 13-0తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా కెప్టెన్‌ రాణి విశ్రాంతి తీసుకోవడంతో వెటరన్‌ గోల్‌కీపర్‌ సవిత భారతజట్టుకు సారథ్యం వహించింది. షెడ్యూల్‌ ప్రకారం నేడు జరగాల్సిన భారత్‌-మలేషియా మ్యాచ్‌ జరగటంలేదని ఆసియా హాకీ ఫెడరేషన్‌ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement