Saturday, April 20, 2024

పదేళ్ల క్రితం.. భారతీయుల కల సాకారమైన రోజు

సరిగ్గా పదేళ్ల కిత్రం అంటే ఏప్రిల్ 2, 2011న భారతీయులందరూ నిరీక్షిస్తున్న కల సాకారమైంది. సచిన్ టెండూల్కర్ జీవితంలో తొలిసారి వరల్డ్ కప్ అందుకున్న రోజు అది. ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకను భారత్ చిత్తు చేసిన రోజు అది. ముంబైలో వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ సెంచరీ మిస్ అయినా.. చివర్లో ధోనీతో కలిసి యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ తాజా జ్ఞాపకాలుగా కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ తర్వాత రెండు వరల్డ్ కప్పులు జరిగినా భారత్ విజేతగా నిలవలేక పోయింది.

1983లో తొలిసారిగా కపిల్ దేవ్ సేన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరోసారి విజేతగా నిలవడానికి 28 ఏళ్లు పట్టింది. ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా టోర్నీలో 14 దేశాలు పాల్గొన్నాయి. గ్రూప్‌ ఏలో రెండో స్థానంలో నిలిచిన శ్రీలంక, గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇండియా ఫైనల్స్‌కు చేరడం విశేషం. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో శ్రీలంక 91 పరుగులు బాదింది. ఇక ఛేజింగ్‌లో భారత్ ఆదిలోనే సెహ్వాగ్ (0) వికెట్ కోల్పోయినా సచిన్ (18) పరుగులకే వెనుతిరిగినా గంభీర్ (97), కోహ్లీ (35), ధోనీ (91) యువరాజ్ (21) రాణించడంతో భారత్ మరోసారి ప్రపంచకప్ గెలిచి భారతీయులను ఆనందాల్లో ముంచెత్తింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత యువ క్రికెటర్లు కోహ్లీ, శ్రీశాంత్‌లతో పాటు ధోనీ కూడా సచిన్‌ను భుజాలపై మోసి సంబరాలు జరిపారు. అటు ప్రపంచకప్ గెలిచిన జట్టులో ప్రతి క్రికెటర్‌కు బీసీసీఐ రూ. 2 కోట్ల రివార్డు అందించింది. సహాయక సిబ్బందికి కూ. 50 లక్షలు, సెలెక్షన్ కమిటీ సభ్యులకు రూ. 25 లక్షలను అందించింది. అంతేకాకుండా ధోనీకి రూ. 2 కోట్లు, జట్టులోని ఢిల్లీ క్రికెటర్లకు రూ. 1 కోటి చొప్పున ఢిల్లీ ప్రభుత్వం అందించింది. ధోనీకి ఫెరారీ కారు, యువరాజ్‌కు ఆడి కార్లను ఆయా కంపెనీలు బహుమతిగా ఇచ్చాయి. యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్‌లకు గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏకలవ్య అవార్డులు ప్రకటించాయి.

https://www.espncricinfo.com/series/icc-cricket-world-cup-2010-11-381449/india-vs-sri-lanka-final-433606/full-scorecard

Advertisement

తాజా వార్తలు

Advertisement