Friday, March 29, 2024

ఇండియా ఓపెన్‌ టోర్నీ.. రెండో రౌండ్‌లోకి..

ఇండియన్‌ షట్లర్స్‌ సైనా నెహాల్‌, లక్ష్య సేన్‌తో పాటు హెచ్‌ఎస్ ప్రణయ్ లు బుధవారం ఇండియా ఓపెన్‌ టోర్నీ రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. మాజీ ప్రపంచ నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి సైనా.. వరుస గాయాల కారణంగా.. గతేడాది చాలా కాలం పాటు ఆటకు దూరమైంది. చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి తెరెజా సాబికోవాను 22-20, 1-0 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. వెన్నునొప్పి కారణంగా తెరెజా ఆట మధ్యలో నుంచి తప్పుకోవడంతో సైనా రెండో రౌండ్‌లో ప్రవేశించింది. ఎంతో కాలం తరువాత ఆడానని, ఈ మ్యాచ్‌తో ఆత్మవిశ్వాసం పెరిగిందని, టోర్నీలో ఉన్నట్టు ప్రాక్టీస్‌లో పాయింట్లు ఉండవని తెలిపింది. తరువాతి మ్యాచుల్లో మరింత రాణిస్తానని చెప్పుకొచ్చారు. నాల్గో సీడ్‌ క్రీడాకారిణి అయిన సైనా.. రెండో రౌండ్‌లో మాలవికా బంసోద్‌తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో 8వ సీడ్‌ ఆటగాడు ప్రణయ్‌.. స్పెయిన్‌ ఆటగాడు పాబ్లో అబియాన్‌ను 21-14, 21-7 పాయింట్ల తేడాతో రెండు వరుస సెట్స్‌లో ఓడించాడు. రెండో రౌండ్‌లో మిథున్‌ మంజునాథ్‌తో తలపడతాడు.

అనురాపై కశ్యప్‌ విజయం..
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో కాంస్యంతో మెరిసిన మూడో సీడ్‌ ఆటగాడు లక్ష్యసేన్‌.. ఈజిప్ట్ ఆటగాడు హతీం ఎల్గమల్‌ను 21-15, 21-7 పాయింట్ల తేడాతో ఓడించాడు. కామన్‌వెల్త్ కాంస్య పతకం మహిళ డబుల్‌ జోడీ విజేత అశ్వినీ పొన్నప్ప, సిక్కిరెడ్డిలు కూడా జననీ అనంతకుమార్‌, దివ్య బాల సుబ్రమణ్యంను 21-7, 19-21, 21-13 పాయింట్ల తేడాతో ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు. కశ్యప్‌ 21-14, 21-14తో అనురా ప్రభు దేశాయ్‌పై గెలిచాడు. కెయురాతో కశ్యప్‌ తదుపరి మ్యాచ్‌ ఆడుతాడు. స్మిత్‌ తోష్నీని కెయురా 15-21, 21-19, 21-8 పాయింట్ల తేడాతో ఓడించాడు. పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ 19-21, 21-7, 21-14తో ఓడించిన రాహుల్‌.. ఐర్లాండ్‌కు చెందిన నాట్‌ న్గుయెన్‌తో తలపడుతాడు. తాన్య హేమంత్‌.. 9-21, 21-12, 21-19తో సాయి ఉత్తేజిత రావును ఓడించింది. ఇప్పటికే సింధు, కిదాంబి, సమీర్‌ వర్మలు రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement