Wednesday, December 11, 2024

IND vs SA | రేప‌టి నుంచే భార‌త్-ద‌క్షిణాఫ్రికా టీ20 పోరు !

సూర్యకుమార్‌ సారథ్యంలోని టీమిండియా మరో టీ20 సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. రేప‌టి నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌ జరగనుంది. డర్బన్‌ వేదికగా తొలి టీ20 జరుగుతుంది. ఈ పొట్టి సిరీస్‌ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత జట్టుకు సూర్యకుమార్‌ సారథ్యం వహిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ పొట్టి క్రికెట్‌కు రిటైర్మెట్‌ ప్రకటించడంతో అతడి స్థానంలో సూర్యకుమార్‌ను టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.

సూర్యకుమార్‌ నాయకత్వంలో భారత్‌ మంచి ఫలితాలు సాధిస్తోంది. ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత శ్రీలంక పర్యాటనకు వెళ్లిన యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటుకుంది. శ్రీలంకను వారి హోమ్‌గ్రౌండ్స్‌లో వైట్‌వాష్‌ చేసింది.

అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లోనూ సూర్యకుమార్‌ సారథ్యంలోని టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్‌ను సైతం 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే, ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్‌ రూపంలో సూర్యకు అసలు సీసలైన సవాలు ఎదురుకానుంది.

సూర్యకు కఠిన సవాల్‌..

పొట్టి క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న టీమిండియా కొత్త సారది సూర్యకుమార్ యాదవ్‌కు దక్షిణాఫ్రికా పర్యటన గట్టి సవాల్‌గా మారనుంది. ఎందుకంటే అదే సమయంలో భారత్‌.. పటిష్టమైన ఆస్ట్రేలియానతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఆసీస్‌ వెళ్లనుంది.

- Advertisement -

ఈ రెండు సిరీస్‌లు ఒకే సమయంలో షెడ్యూల్‌ కావడంతో సీనియర్లతో కూడిన భారత జట్టును ఆసీస్‌ పర్యటన కోసం ఎంపిక చేశారు. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మార్గనిర్దేశంలో సీనియర్‌ ప్లేయర్లతో కూడిన భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో సఫారీ టూర్‌లో మరోసారి యువ ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు హైదరాబాదీ మాజీ స్టార్‌ క్రికెటర్‌, ఎన్‌సీసీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్యమన్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. సూర్య సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టుకు దక్షిణాఫ్రికా పర్యటన చాలా కీలకంగా మారింది.

ఇటీవలే న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్‌ సేన 0-3తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ జట్టులోని కొందరూ సీనియర్‌ ఆటగాళ్లు త్వరలోనే రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్ల కోసం బీసీసీఐ అన్వేషణ మొదలు పెట్టనుంది. విదేశీ గడ్డపై నిలకడగా రాణించే ఆటగాళ్లే తదుపరి టీమ్‌ సెలెక్షన్స్‌లో ముందు వరుసల ఉండటం ఖాయం. అందుకే దక్షిణాఫ్రికా సిరీస్‌ యువ ఆటగాళ్లకు ప్రధానం కానుంది.

హార్దిక్‌ పాండ్య పునరాగమనం..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈ టీ20 సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరమైన హార్దిక్‌ మళ్లి మైదానంలో అడుగు పెట్టనుండటం టీమిండియాకు ప్లెస్‌ పాయింట్‌గా మారనుంది. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ విదేశీగడ్డపై ఆడిన అనుభవం టీమిండియా కు కలిసొచ్చే అంశం.

అలాగే అతడు కీలక సమయల్లో బౌల్‌తో వికెట్లు తీయడం.. బ్యాట్‌తో పరుగులు సాధించగలడు. అతడు తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు శుభపరిణామమే. సఫారీ జట్టుపై పాండ్యకు మంచి రికార్డు కూడా ఉంది. ప్రస్తుత జట్టులో పేస్‌ దళానికి అతడే నాయకత్వం వహించనున్నాడు.

పాండ్యతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, అవేశ్‌ ఖాన్‌ వంటి ఫాస్ట్‌ బౌలర్లు కూడా పేస్‌కు అనుకూలించే సఫారీ గడ్డపై మంచి ప్రదర్శన చేయగలరు. స్పిన్‌లో అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌ తదితరులు కూడా సత్తా చాటుకునే అవకాశాలు ఉన్నాయి.

తిలక్‌వర్మకు భలే చాన్స్‌..

ఇటీవలే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు దూరమైన హైదరాబాదీ యవ సంచలనం తిలక్‌ వర్మ దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ భారత్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే మరో తెలుగబ్బాయి నితీష్‌ కుమార్‌ రెడ్డి ఆసీస్‌ టూర్‌కు ఎంపికవడంతో టీ20 సిరీస్‌లో తెలుగు రాష్ట్రల నుంచి తిలక్‌ ఒక్కడే బరిలోకి దిగుతున్నాడు.

తిలక్‌ వర్మ కూడా దాదాపు 11 నెలల తర్వాత పొట్టి సిరీస్‌లో పునరా గమనం చేయనున్నాడు. బ్యాట్‌తో మెరిపిస్తే.. తర్వాత కూడా భారత జట్టులో కొనసాగే అవకాశాలు మెరుగుపడుతాయి. ఇక బ్యాటింగ్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌తో పాటు సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవలే బంగ్లాతో జరిగిన ఆఖరి టీ20లో శాంసన్‌ విధ్వంస కర బ్యాటింగ్‌తో సెంచరీ బాదేసి అందరి దృష్టి ఆకర్షించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై కూడా అతను బ్యాట్‌ ఝుళిపించా లని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. అలాగే సన్‌రైజర్స్‌ యువ ఓపెనర్‌ అభిషేక్‌ వర్మపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

బంగ్లా సిరీస్‌లో దూకుడుగా ఆడినా.. భారీ స్కోర్లు చేయడంలో మాత్రం అతడు విఫలమయ్యాడు. ఇక సఫారీ టూర్‌లో మరింతా మెరుగ్గా ఆడాలని ఆశిద్దాం. కాగా, ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉంది.

ఎయిడెన్‌ మర్క్‌రమ్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ను వారి సొంతగడ్డపై ఓడించడం సూర్య సేనకు కఠిన సవాల్‌గా మారనుంది. ప్రొటీస్‌ జట్టులో కెప్టెన్‌ మార్క్‌రమ్‌తో పాటు హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, కొయెట్టి, ఒట్నిల్‌ బార్ట్‌మన్‌ అత్యంత ప్రమాదకరమైన టీ20 స్పెషలిస్టు బ్యాట్స్‌మన్లు ఉన్నారు. అలాగే ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లు కూడా వారి జట్టులో ఉన్నారు.

జట్ల వివరాలు: (స్క్వాడ్స్‌)

భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ విశాక్‌, అవేశ్‌ ఖాన్‌, యశ్‌ దయాల్‌.

దక్షిణాఫ్రికా: ఎయిడన్‌ మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్ట్‌ కొయెట్జీ, డోనోవన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్‌, మార్కొ జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, పాట్రిక్‌ క్రూగర్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, మిహ్లాలీ ఎంపోంగ్వానా, నకాబా పీటర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, ఆండిల్‌ సిమెమెలన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, లుథే సిపావ్లూ.

Advertisement

తాజా వార్తలు

Advertisement