Thursday, April 18, 2024

ఇంగ్లండ్‌- భారత్‌ వన్డే సిరీస్‌.. రేపే ఆఖ‌రి మ్యాచ్

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే తొలి వన్డేలో 10వికెట్లతో విజయం సాధించిన రోహిత్‌ సేన, రెండో వన్డేలో మాత్రం పరాజయం పాలైంది. తొలుత బౌలింగ్‌, తర్వాత బ్యాటింగ్‌లో విఫలం కావడంతో 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపొందింది. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. ఆఖరి మ్యాచ్‌పైనే ఇటు భారత్‌, అటు ఇంగ్లండ్‌ జట్లు దృష్టి కేంద్రీకరించాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. మాంచెస్టర్‌ వేదికపై ఇంగ్లండ్‌, భారత్‌ జట్ల ఆటతీరును పరిశీలిస్తే… గత ఐదు వన్డే మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ నాలుగింటిలో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. భారత్‌ జట్టు కూడా గత ఐదు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌ మినహా అన్నింటిలోనూ గెలుపొందింది.

దీంతో ఇరుజట్లకు మంచి రికార్డు ఉందని చెప్పవచ్చు. టాస్‌ గెలవడంతోపాటు తొలుత బ్యాటింగ్‌ చేసిన వారికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ మైదానంలో గత 9 మ్యాచ్‌లను పరిశీలిస్తే… తొలి బ్యాటింగ్‌లో 290కు పైగా పరుగులు చేసిన రికార్డు ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే 8 సార్లు గెలిచిన చరిత్ర ఈ మైదానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే… టాస్‌ గెలవడంతోపాటు, తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇంగ్లండ్‌ జట్టులో ఒకటి రెండు మార్పులు ఉండొచ్చని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. అయితే టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని, బ్యాటింగ్‌ పరంగా కొంత మెరుగు పరుచుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌ 54 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేయగా, లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 26 బంతులు ఆడి కేవలం 9 పరుగులకే ఔట్‌ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వెస్టిండీస్‌ టూర్‌కు భారత జట్టు కెప్టెన్‌ వెళ్లనున్న శిఖర్‌ ధావన్‌ తన బ్యాటింగ్‌ తీరును మెరుగుపరుచుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంగ్లండ్‌ (ప్రాబబుల్స్‌): జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, డేవిడ్‌ విల్లే, క్రయాగ్‌ ఎవర్టన్‌, బ్రైడాన్‌ కార్సే, రీస్‌ టోప్లే

ఇండియా (ప్రాబబుల్స్‌): రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంథ్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్‌ షమీ; జస్‌ప్రీత్‌ బుమ్రా, యజ్వేంద్ర చాహల్‌, ప్రసిధ్‌ క్రిష్ణ/ శార్దూల్‌ ఠాకూర్‌

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement