Thursday, April 25, 2024

Followup : సెమీస్‌కు ఇంగ్లండ్‌, లంకపై ఘనవిజయం.. ఆసీస్‌ ఆశలు ఆవిరి

టీ20 వరల్డ్‌ కప్‌ 2022 టోర్నీలో గ్రూప్‌-1 సూపర్‌ 12 మ్యాచులు ముగిశాయి. ఆఖరి మ్యాచ్‌ వరకూ సెమీస్‌ బెర్త్‌లపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు 7 పాయింట్లతో సెమీఫైనల్‌ చేరింది. ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా 7 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్‌ రన్‌రేట్‌ కారణంగా మూడో స్థానానికి పరిమితమైంది.

శనివారంనాడిక్కడ శ్రీలంకతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. 14 బంతుల్లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన కుశాల్‌ మెండిస్‌, క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా, సామ్‌ కుర్రాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆరంభంలో దూకుడుగా ఆడిన పథుమ్‌ నిసంక, తాను ఎదుర్కొన్న మొదటి 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అయితే ఆతర్వాత 30 బంతుల్లో 36 పరుగులే రాబట్టగలిగాడు. 45 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేసిన నిసంక, అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

అసలంక 8, శనక 3 పరుగులు చేసి తీవ్రంగా నిరాశ పరిచారు. 22 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన రాజపక్స, మార్క్‌ వుడ్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుటయ్యాడు. 9 పరుగులు చేసిన హసరంగ రనౌట్‌ కాగా కరుణ రత్నే, ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి డకౌట్‌ అయ్యాడు. ఒకానొక దశలో 10 ఓవర్లలో 80 పరుగులు చేసి భారీ స్కోరు చేసేలా కనిపించిన శ్రీలంక, చివరి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే రాబట్టి 6 వికెట్లు కోల్పోయింది.

అనంతరం 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఛేదనలో 75 పరుగుల వరకు ఒక్క వికెట్టు కూడా కోల్పోని ఇంగ్లండ్‌, అక్కడి నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. లంక స్పిన్నర్లు ధనంజయ డిసిల్వా, పనిందు హసరంగ, పేసర్‌ లహిరు కుమార రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచారు. అయితే బెన్‌ స్టోక్స్‌ చివరి వరకు క్రీజులో నిలిచి ఇంగ్లండ్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. అంతకు ముందు ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ 47, జోస్‌ బట్లర్‌ 28 పరుగులు చేసి శుభారంభం అందించారు.

వీరి ఊపు చేస్తే ఇంగ్లండ్‌ సునాయాసంగా గెలుస్తుందనిపించింది. అయితే మిడిల్‌ ఓవర్లలో లంక బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌ శిబిరంలో ఆందోళన నెలకొంది. కానీ టార్గెట్‌ చిన్నదే కావడంతో ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది. కాగా ఈ విజయంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకోగా, ఆతిథ్య ఆస్ట్రేలియాకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయుంటే ఆసీస్‌కు చాన్స్‌ దక్కేది. గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌ ఇప్పటికే సెమీస్‌ చేరగా, రెండో జట్టుగా ఇంగ్లండ్‌ సెమీస్‌ చాన్స్‌ చేజిక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement