మహారాష్ట్ర : 2008లో మహారాష్ట్ర (Maharashtra)లోని మాలెగావ్ (Malegaon)లో జరిగిన పేలుళ్ల కేసు (blast case) లో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో ముంబై NIA ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఏడుగురు నిందితులనూ నిర్దోషులుగా విడుదల చేసింది. ఇందులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ కూడా ఉన్నారు.
మాలెగావ్‌లోని భికు చౌక్‌లో 2008 సెప్టెంబర్ 29న రంజాన్ పండుగ సమయంలో ఒక మోటార్‌సైకిల్‌కు అమర్చిన బాంబు పేలి ఆరుగురు మరణించగా, 101 మంది గాయపడ్డారు. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) ఈ కేసును దర్యాప్తు చేసింది. ఆ తర్వాత 2011లో కేసును ఎన్ఐఏకు అప్పగించారు.
నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని NIA ప్రత్యేక కోర్టు జడ్జి ఎ.కె. లాహోటి తీర్పును వెలువరిస్తూ పేర్కొన్నారు. బైక్‌లో బాంబు పెట్టినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని, కల్నల్ పురోహిత్ ఇంటి వద్ద RDXకు సంబంధించిన ఆధారాలు కూడా దొరకలేదని కోర్టు తెలిపింది. ఉగ్రవాదానికి ఎలాంటి రంగు ఉండదని, చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
దాదాపు 323మంది సాక్షులను విచారించినప్పటికీ, వారిలో 37 మంది సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చుకోవడం, కొన్ని మెడికల్ సర్టిఫికేట్లలో అవకతవకలు జరిగినట్లు కోర్టు గుర్తించింది. ఈ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌తో పాటు, మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రాహిర్కర్, సమీర్ కులకర్ణి, సుధాకర్ చతుర్వేది, సుధాకర్ ధర్ ద్వివేది నిందితులుగా ఉన్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ విచారణకు తెరదించుతూ, ఈ తీర్పు దేశ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.