Friday, April 26, 2024

వాతావరణ మార్పులకు అనుగుణంగా, నూతన విత్తనాలను రూపొందించాలి

రాజేంద్రనగర్‌, ప్రభన్యూస్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా విత్తనమేళాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి విత్తనమేళా ప్రారంభం కాగా.. రాష్ట్రంలో మరో 18 కేంద్రాల్లో ఈ విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాజేంద్రనగర్‌లో జరిగిన విత్తనమేళాని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండ బాలకోటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రైతాంగానికి అవసరమైన అన్ని వనరులు పుష్కలంగా లభిస్తున్నాయని ఆయన అన్నారు. నేడు తెలంగాణ గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా రూపొందిందన్నారు. వర్సిటీ-లో పరిశోధనలు ఇంకా విస్తృతం కావాలని కొండ బాలకోటేశ్వరరావు సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ సంస్థలు అందించే విత్తనాల ధరలు సరసంగా ఉండడంతోపాటు, నాణ్యత అధికంగా ఉంటుందనే భరోసా రైతాంగంలో ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమీషనర్‌ హనుమంతు అన్నారు.

వాతావరణ మార్పుల కారణంగా పంటల సరళిలోనూ అనివార్యంగా మార్పులు రానున్నాయన్నారు. అందుకు తగ్గట్లుగా నూతన విత్తనాలను రూపొందించాలని హనుమంతు విశ్వవిద్యాలయ అధికారులకు సూచించారు. ఏడు సంవత్సరాల నుండి వర్సిటీ నిర్వహిస్తున్న విత్తనమేళాకి అపూర్వ ఆదరణ లభిస్తోందని ఉపకులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌ రావు అన్నారు. ఈ ఏడేళ్ళ కాలంలో దేశంలోనే తొలిసారిగా పీజెటిఎస్‌ఎయు వివిధ పంటలకి చెందిన 51 వంగడాలని రూపొందించిందన్నారు. అందులో సుమారు 16 వంగడాలను ఇతర రాష్ట్రాలు ఆదరిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, నీటివనరులను అందుబాటులోకి తీసుకురావడం వల్ల తెలంగాణలో 7, 8 పంటల ఉత్పాదకత దేశ సగటు కంటే ఎక్కువుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్న సాగునీటి వసతితో ఉత్పాదకతలు ఇంకా పెరగాలన్నారు. రైతులు కూడా సమర్థనీటి యాజమాన్య పద్ధతులు, ఎరువులు, పురుగుమందుల సక్రమ వినియోగ పద్ధతులు అవలంబించాలని, ముందు తరాలకి అవసరమైన వనరులను పరిరక్షించడం పైన కూడా దృష్టి పెట్టాలని ప్రవీణ్‌ రావు సూచించారు. జులై పదవతేదీ వరకూ వర్సిటీలో విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. పీజెటిఎస్‌ఏయు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐసిఏఆర్‌ – అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు రైతులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ర్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌, పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ జగదీశ్వర్‌, సీడ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.జగన్మోహన్‌ రావు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement