Thursday, April 18, 2024

వైసీపీ సామాజిక భేరి.. 26 నుండి బస్సు యాత్రకు సన్నాహాలు..

నర్సరావుపేట అర్బన్‌, (ప్రభన్యూస్‌): ఉత్తరాంధ్ర నుంచి అధికార వైఎస్సార్‌సీపీ పార్టీవారు 17 మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మంత్రులతో కలిసి ”సామాజిక భేరీ” పేరుతో ఈ నెల 26వ తేదీనుండి 29వరకు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్ర రాయలసీమ ప్రాంతంలో అనంతపురం బహిరంగ సభతో ముగించాలని ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. ఈ యాత్రల్లో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో, కోస్తాంధ్ర, రాయసీమ జిల్లాలో 4 చోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా కోస్తాంధ్రలో పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో సభను నిర్వహించేందుకు అధికార పార్టీకి చెందిన పెద్దలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రజల వద్దకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో వున్న పార్టీ శ్రేణలను కలుపుకొని, గ్రామ స్థాయి కార్యకర్తలు సైతం ఆయా బహిరంగ సభల్లో పాల్గొని ఈ మూడేళ్ళ కాలంలో వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధి, సేవలు, సామాజిక వర్గాలకు కల్పించిన అవకాశాల గురించి విసృతంగా ప్రచారం చేయించేందుకు సన్నహాలను ప్రారంభించారు.

ఈ మూడేళ్ళలో సామాజిక న్యాయం సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న చర్యలు, ఐదేళ్ళ కాలంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని రాజ్యసభకు నారా చంద్రబాబునాయుడు పంపని వైనాన్ని, 8 స్థానాలు ఖాళీ అయితే 4 స్థానాలను బిసిలకే ఇచ్చిన వైఎస్‌ జగన్‌ పనితీరును ప్రజలకు చేరువ చేయాలని పార్టీ పెద్దలు నిర్దేశించి ఈ యాత్రకు సన్నద్దమౌతున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో బిసిలకు 21 శాతం పదవులు దక్కితే..ఇపుడు సియం జగన్‌ 40 శాతం పదవులను బిసిలకు ఇచ్చి వారి వెన్నుతట్టినట్లు ఈ ప్రచార సభల్లో నేతల ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించి సామాజిక మహా విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని సియం జగన్‌ నిర్ణయించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సామాజిక న్యాయం ఈ మూడేళ్ళ కాలంలో వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న, ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని చాటి చెప్పేలా ఈ నెల 26 నుండి 29వ తేదీ వరకు 17 మంది మంత్రులతో బస్సు యాత్ర చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. దీనిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికార పార్టీ నాయకులు గ్రామ స్థాయినుంచే ప్రణాళికను సిద్దం చేసుకొని షెడ్యూల్డు ప్రకారం సభను నిర్వహించే కేంద్రానికి కార్యకర్తలను తరలించేందుకు సమాలోచనలు చేస్తున్నారు.

నర్సరావుపేటలో..భారీ బహిరంగ సభ

ఇదిలా ఉండగా ”సామాజిక భేరీ” పేరుతో అధికార వైఎస్సార్‌సీపీ నిర్వహించనున్న బస్సు యాత్రలో భాగంగా 4 ప్రధాన కేంద్రాలలో భారీ సభలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర ప్రాంతంలోని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించాలని అధినాయకత్వం నిర్ణయించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ జిల్లాలో వున్న 7 అసెంబ్లీ స్థానాలలో, ఒక ఎంపి స్థానంలో అధికార పార్టీకి చెందిన వారే ఉండటం వల్ల నర్సరావుపేటలో ఈ సభను నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని చెబుతున్నారు. ఇద్దరు మంత్రులు, ఎంపి, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవులను అలంకరించిన వారు..ఇలా అనేక పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ సభను విజయవంతం చేయడంలో కృతనిశ్చయులుగా చేయాలని పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఒకవైపు ఒంగోలు నగరానికి సమీపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాలు ఈ నెల 27, 28 తేదీలలో జరుగనున్న నేపద్యంలో నర్సరావుపేటలో అధికార పార్టీ బహిరంగ సభ ఏ తేదీలో నిర్వహిస్తారోనని అందరిలో ఆశక్తి నెలకొని వుందని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement