Saturday, April 20, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజం.. జనవరి 13న వారణాశిలో ప్రధాని ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గంగ, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభమై.. మార్చి 1న అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ముగియనుంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పెద్ద నదులపై క్రూయిజ్ (షిప్)లో పర్యటించిన సందర్భాలు లేవని, అందుకే గంగ, బ్రహ్మపుత్రలపై జరిగే ఈ పర్యాటకయాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వారణాసిలో 13న ప్రారంభమయ్యే ఈ షిప్ టూరిజంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన పర్యాటకులు ప్రత్యేకంగా ప్రయాణించనున్నారు. ఈ 52 రోజుల్లో వీరు 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు.

పట్నా, కోల్ కతా, ఢాకా (బంగ్లాదేశ్), ధుబ్రి (బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భారత భూభాగం), గువాహటి, మీదుగా మజూలీ ఐలాండ్ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ షిప్ లో ప్రయాణించే పర్యాటకులు, ఈ రెండు నదుల ఒడ్డున ఉండే ప్రముఖ నగరాలను, పర్యాటక క్షేత్రాలను సందర్శిస్తారు. జల మార్గాలు,  షిప్పింగ్, నౌకాశ్రయాల మంత్రిత్వ శాఖ ఈ షిప్ టూరిజం ప్రాజెక్టునకు సంధానకర్తగా ఉంది. ఈ ప్రయాణానికి సంబంధించినంతవరకు భారత్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు గుండా ప్రయాణం జరుగుతున్న సందర్భంలో పర్యాటకులకు అన్నిరకాలు సౌకర్యాలు చేపట్టినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

భారతదేశంలో షిప్ (క్రూయిజ్) టూరిజానికి ఈ రకమైన షిప్ ప్రయాణం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. దేశంలో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోందని, రానున్న రోజుల్లో భారతీయ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా జాతీయ పర్యాటక విధానం (National Tourism Policy) కి రూపకల్పన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం అన్ని వర్గాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement