Sunday, December 3, 2023

Delhi | 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి : బీఆర్‌ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని బీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై జరిగిన చర్చలో ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం తర్వాత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం సంతోషంగా ఉందన్నారు.

ఇందుకు సంబంధించి జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్నారు. 128వ రాజ్యాంగ సవరణ, పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి 2024 ఎన్నికల్నేలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. 1996లో దేవగౌడ ప్రభుత్వం, 12వ లోక్‌సభలో వాజపాయ్ ప్రభుత్వం, 13, 15 లోక్‌సభల్లో కూడా మహిళా బిల్లు ప్రస్తావనకు వచ్చినా ఆమోదం పొందలేదని గుర్తు చేశారు.

- Advertisement -
   

2014 జూన్‌లోనే తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపారని అన్నారు. ఇప్పటికే  తెలంగాణ రాష్ట్రంల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జట్పీటీసీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతోందని చెప్పారు. అలాగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తెలంగాణా సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని నామ హర్షం వ్యక్తం చేశారు.

తాను ఎంపీగా ఉన్న కాలంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, అందులో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. అయితే బిల్లు అమలుపై మహిళా లోకంలో అసంతృప్తి కనిపిస్తోందని తెలిపారు. ముందుచూపు కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ బిల్లును కేంద్రానికి పంపించారని ఆమె గుర్తు చేశారు. కాలయాపన చేయకుండా త్వరగా బిల్లును అమల్లోకి తీసుకురావాలని కోరారు. లేదంటే ప్రజలు దీనిని ఎన్నికల ప్రచారం, రాజకీయ ఎత్తుగడగా మహిళలు, ప్రజలు భావించే ప్రమాదముందన్నారు. ప్రస్తుతమున్న జనాభా ప్రాతిపదికన వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement