Sunday, February 5, 2023

Telangana | న‌లుగురు సీఎంలతో.. దేశం దృష్టిని ఆక‌ర్షించిన‌ బీఆర్‌ఎస్‌ సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యావత్‌ దేశం దృష్టిని ఆక‌ర్షిస్తూ.. దేశ ప్రజలు చర్చించుకునేలా సాగిన భారత్‌ రాష్ట్ర సమితి బహిరంగ సభలో జాతీయ స్థాయిలో పేరున్న కీలక నేతలు సందడి చేశారు. మంగళవారమే హైదరాబాద్‌ చేరుకున్న ఢిల్లి, పంజాబ్‌, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రివాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో సహా పలువురు హెలీకాఫ్టర్లలో ఖమ్మం చేరుకున్నారు. ఉదయం సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా వారికి సీఎం కేసీఆర్‌ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వీరిని తీసుకొని రెండు హెలీకాఫ్టర్లలో లక్ష్మినర్సింహ్మస్వామి దర్శనానికి బయల్దేరి వెళ్లారు. హెలీపాడ్‌నుంచి అగ్రనేతలంతా తొలుత ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి లక్ష్మినర్సింహ్మస్వామి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన వీరికి ఆలయ త్రితల రాజగోపురం వద్ద అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అగ్రనేతలంతా ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద హారతి తీసుకున్నారు.

మూలవిరాట్‌ స్వయంభూ శ్రీ యాదగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి ఆలయంలో ప్రధానార్చకులు, వేద పండితులు సంకల్పం, సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. హారతి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ వేద ఆశీర్వచనం అందించారు. శ్రీయాదగిరి లోఈనర్సింహ్మాస్వామి ఆలయ ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రులు, నేతలు తిలకించారు. ఆలయ ప్రాశస్త్యం, ఆధునకరించిన విధానం గురించి సీఎం కేసీఆర్‌ ఇతర నేతలు సీఎంలకు వివరించారు. ఆ తర్వాత రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టనుండి ఖమ్మం బయల్దేరి వెళ్లారు.
యాదాద్రి దర్శనం తర్వాత ఖమ్మం చేరుకున్న అతిథులు, సీఎం కేసీఆర్‌తో కలిసి సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ చేతుల మీదుగా కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఛాంబర్‌లో కలెక్టర్‌ గౌతమ్‌ను కూర్చొబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన జిల్లా పాలనాసౌధాల నిర్మాణం తీరుతెన్నులను వారికి వివరించారు.

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆహుతులైన సీఎంలు, సీఎం కేసీఆర్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు, సీఎస్‌ శాంతికుమారిలు కంటి పరీక్షల తీరును వివరించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులకు సీఎంలు విజయన్‌, కేజ్రివాల్‌, భగవంత్‌మాన్‌ సింగ్‌, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ అగ్రనేత రాజాలు కళ్లజోళ్లు అందించారు.

దర్శనానికి వెళ్లని క‌మ్యూనిస్టు నేత‌లు..
యాదగిరి గుట్టలో హెలీపాడ్‌ నుంచి నేతలంతా ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అతిథి గృహంలోనే ఉండిపోగా, మిగతా నేతలు, సీఎంలు లక్ష్మినర్సింహ్మస్వామి దర్శనానికి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement