Wednesday, April 24, 2024

Delhi | కేంద్రం ఆంక్షలతో రూ.40 వేల కోట్ల నష్టం.. స్పీకర్ అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్ ఎంపీ నామా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపై శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చ జరిపి, తెలంగాణాకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. శీతాకాల సమావేశాల నేపథ్యంలో మంగళవారం స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఎంపీ నామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. పైగా తెలంగాణా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.

తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతినేలా ఉద్దేశపూర్వకంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్క విభజన హామీ అమలు చేయకపోవడం పట్ల నామ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఎం స్థాపన తదితర హామీలు ఏమయ్యాయని ప్రశించారు. వీటన్నింటిపై ఈ సమావేశాల్లోనే చర్చించి, తెలంగాణకు న్యాయం చేయాలని నామ కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. రుణాలు పొందే విషయంలో సైతం లేనిపోని ఆంక్షలు విధించి, వివక్ష ప్రదర్శిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు.

పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలను ఆతలాకుతలం చేస్తున్నాయని, ఈ అంశాలపై ప్రత్యేక చర్చ జరపాలన్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, నిరుద్యోగం, కుల గణన, రిజర్వేషన్లు, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. కేంద్రం కొర్రీలతో తెలంగాణా ఆర్ధికంగా నష్ట పోవాల్సి వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement