Friday, March 29, 2024

21 శాతం తగ్గిన విప్రో నికర లాభం, 2,564 కోట్లు నికర లాభం

ఐటి దిగ్గజం విప్రో 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 21 శాతం తగ్గి , 2,564 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు పెరగడం వల్లే నికర లాభం తగ్గినట్లు వివరించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ 3,243 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం 18 శాతం పెరిగి, 21,529 కోట్లు ఉంది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 18,048 కోట్లు. ఈ త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు 22.9 శాతం పెరిగి 18,648 కోట్లుగా ఉంది. వచ్చే సెప్టెంబర్‌ త్రైమాసికంలో 3 నుంచి 5 శాతం వృద్ధితో ఆదాయం 2,817 మిలియన్‌ డాలర్ల నుంచి 2,872 మిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది.

“విప్రో అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, ప్రస్తుతం ఆర్డర్‌ బుక్‌ 32 శాతం వార్షిక పెరుగుదల నమోదు చేసిందని కంపెనీ సీఈవో , మేనేజింగ్‌ డైరెక్టర్‌ తైరీ డెలాఫోర్ట్‌ తెలిపారు. ఈ కాలంలో అనేక పెద్ద డీల్స్‌ను పూర్తి చేశామని, మరికొన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మార్కెట్‌ను మరింత పెంచుకుంటామని, క్లైయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆయన ప్రకటించారు. కంపెనీ 15 శాతం ఆపరేటింగ్‌ మార్జిన్‌ సాధించిందని విప్రో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జితిన్‌ దలాల్‌ తెలిపారు. సొల్యూషన్స్‌, సామర్ధ్యాలను పెంచుకునేందుకు కంపెనీ పెట్టుబడులు పెడుతుందని ఆయన వివరించారు. బుధవారం నాడు విప్రో షేరు మార్కెట్‌లో 1.6 శాతం పెరిగి 412.20 వద్ద ట్రేడ్‌ అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement