Thursday, March 28, 2024

కేరళలో చరిత్ర సృష్టిస్తారా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్​ జరుగుతోంది. బరిలో 957 మంది అభ్యర్థులు ఉన్నారు. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్​, కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే, బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

ప్రస్తుతం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉంది.  తమిళనాడు మాదిరిగానే కేరళ ఓటర్లు కూడా ఒకేసారి ఒకరికి మరొకసారి మరొకరికి అవకాశం ఇస్తుంటారు. అయితే, ఈసారి అధికారం తమ సొంతం అవుతుందని ముఖ్యమంత్రి విజయన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.  సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని విజయన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేర‌ళ ప్ర‌జ‌లు ఎల్డీఎఫ్‌కు చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని అందిస్తార‌ని ధీమా వ్యక్తం చేశారు.

సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్ మరోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది. ఐదేళ్లకు ఓసారి అధికారం మారే సంప్రదాయానికి ఈ దఫా చెక్​ పెట్టాలని చూస్తోంది.సీఎం పినరయి విజయన్​ గత ఐదేళ్లలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆయన హయాంలోనే రాష్ట్రాన్ని రెండేళ్లు వరదలు ముంచెత్తాయి. నిఫా వైరస్‌, తర్వాత కొవిడ్‌ మహమ్మారి వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి అంశాలు రాష్ట్రాన్నీ కుదిపేశాయి. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే, గత ఐదేళ్లలో ఎల్డీఎఫ్ కూటమి సాధించిన అభివృద్ధి శూన్యం అని, ఈసారి ఓటర్లు తమ సంప్రదాయాన్ని కొనసాగించి యూడీఎఫ్ కు పట్టంకడతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్​ నుంచి రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు సీనియర్లు కేరళలో పర్యటించి ప్రచారం చేశారు.

మరోవైపు బీజేపీ కూడా విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మెట్రోమెన్ శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించింది.  దీంతో అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 2016 ఎన్నకల్లో ఎల్డీఎఫ్ 91 స్థానాలు, యూడీఎఫ్ 47 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక బీజేపీ ఒక్క సీటుతో ఖాతా తెరిచింది. ఓటర్లు ఎప్పటిలాగే పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదంటే ఎల్డిఎఫ్ కు అధికారం కట్టబెట్టి చరిత్ర సృష్టిస్తారా చూడాలి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement