Friday, April 19, 2024

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్ల బంగారం.. వారం నుంచి త‌గ్గుతున్న ధ‌ర‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెల్ల బంగారం కన్నీళ్లు పెట్టిస్తోంది. మొన్నటివరకు మంచి ధర పలికిన పత్తి, ఇప్పుడు ఒక్కసారిగా పతనమైంది. ప్రారంభంలో కాసులు కురిపించిన పత్తి పంట ధరలు రోజులు గడుస్తున్నా కొద్దీ పతనమవుతూ రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రకృతి వైపరిత్యాలు, తెగుళ్లు అన్నింటినీ ఎదుర్కొని పంట పండించి మార్కెట్‌కు తరలిస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాని ధరకు పత్తిని విక్రయించ లేక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు, వడ్డీని తీర్చలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంట సాగు తెచ్చిన అప్పులు, వాటి వడ్డీలు పెరుగుతుండటంతో తక్కువ ధరకే పత్తి దిగుబడిని విక్రయించే పరిస్థితులు దాపురించాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

9500 నుంచి 7వేలకు పడిపోయిన ధర…

ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో పత్తి దిగుబడులకు మార్కెట్‌లో ఆశించినస్థాయి కంటే ఎక్కువ ధర పలికింది. క్వింటా పత్తికి రూ.9 వేలు నుంచి రూ.9,500లు వరకు ధర పలికింది. ఆశించిన దాని కంటేఎక్కువ ధర వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారి సంతోషం మూడ్నాళ్ల ముచ్చటే అయ్యింది. వారం రోజులుగా పత్తి ధర పతనమవుతూ వస్తోంది. రోజురోజుకీ ధర పడిపోతోంది. ప్రారంభంలో రూ.9 వేలు పలికిన ధర రోజురోజుకు పతనమవుతూ వస్తోంది. క్రమక్రమంగా రూ.8 వేల నుంచి రూ. 7,500 నుంచి రూ.7000కు పడిపోయింది.

- Advertisement -

పత్తి దిగుబడులు రాక వెలవెలపోతున్న వ్యవసాయ మార్కెట్లు…

పత్తి ధరలు తగ్గడంతో ఆ ప్రభావం వ్యవసాయ మార్కెట్‌లపై పడింది. రోజు వందల బస్తా లకొద్దీ మార్కెట్‌కు వచ్చే పత్తి ఇప్పుడు రోజూ 50 బస్తాల వరకు కూడా రావడం లేదని వ్యాపారులు, వ్యవసాయ మార్కెట్ల అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వస్త్రాలకు అవసరమైన దారం విలువ పడిపోవడం, కొన్నేళ్ల నుంచి వస్త్రాల మిల్లులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కల్పించకపోవడం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా ఉన్న వస్త్ర మిల్లులు, పత్తి జిన్నింగ్‌ మిల్లులు మూతపడ్డాయి. దీంతో పాటుగా ఇతర దేశాలకు బాగా డిమాండ్‌ ఉన్న పత్తి, ఆయిల్‌ ధరలు పడిపోవడం, కాటన బెల్‌(క్యాండీ) ధర తగ్గడం, సీడ్‌ ఆయిల్‌ ఎగుమతులు నిలిచిపోవడంతో పత్తి ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

రైతుల ఇళ్లలోనే పత్తి నిల్వలు…

ధరలు దారుణంగా పడిపోతుండడంతో రైతులు పంటను విక్రయించలేక ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పత్తి ధర తక్కువగా ఉండటంతో, జిల్లాలోని పత్తి రైతులు పంటను విక్రయించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పంటకు మంచి ధరలు వచ్చినప్పుడే విక్రయించాలనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి దిగుబడిని నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కో రైతు ఇంట్లో సుమారుగా 20క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్లకు పైగా పత్తి నిల్వ ఉన్నట్లు సమాచారం.

ధరల పతనానికి వ్యాపారులే కారణం…

వ్యాపారులు కుమ్మక్కై ధరను తగ్గించినట్లు రైతులు ఆగ్ర#హం వ్యక్తంచేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంట తీవ్రంగా నష్టపోయామని, ధరలు కూడా పతనమైతే.. తమ జీవితాలు నాశనం అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూది, పత్తిగింజలు, పత్తి నూనె ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో నిలకడగా ఉన్నప్పటికీ.. స్థానికంగా పత్తి రేటు తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంక్రాంతి పండగ తర్వాత జనవరి నుంచి మే వరకు మార్కెట్లలో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. క్వింటాకు కనీసం 12వేల రూపాయలు చెల్లిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని, లేదంటే ఎకరాకు లక్ష వరకు నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement