Thursday, April 25, 2024

మహిళా బిల్లు ఆమోదించకుండా జీ-20లో ఏం మాట్లాడతారు? : నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా మహిళా సాధికారిత అంశంపై జీ-20 సదస్సులో మాట్లాడే నైతిక అర్హత భారతదేశానికి లేకుండాపోతుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే పార్లమెంటులో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ కల్గిన భారతీయ జనతా పార్టీకి ఇదేమీ కష్టతరం కాదని కూడా ఆయనన్నారు. జీ-20 కూటమికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగా వచ్చిందని, కానీ ప్రధానిగా మోదీ ఉండడం వల్లే వచ్చింది అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ స్థానంలో ఎవరు ప్రధానిగా ఉన్నా భారతదేశానికి జీ-20 సారథ్య బాధ్యతలు వచ్చేవని సూత్రీకరించారు. సైద్ధాంతికంగా తాము బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ, సీపీఐ భారతదేశ సారథ్య బాధ్యతలను ఆహ్వానిస్తోందని, ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే జీ-20 సన్నాహక అఖిలపక్ష సమావేశానికి హాజరవుతున్నామని తెలిపారు.

మరోవైపు రెండ్రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఆయన వివరించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈ అంశాలపై పోరాటం చేయాల్సిందిగా తీర్మానం చేసినట్టు నారాయణ వెల్లడించారు.

- Advertisement -

కమ్యూనిస్టుల చీలికతోనే నష్టపోయాం: నారాయణ

2024వ సంవత్సరం నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీని బలోపేతం చేయడం గురించి చర్చించినట్టు నారాయణ తెలిపారు. కొత్తగా 10 లక్షల సభ్యత్వాల నమోదు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. ఒకప్పుడు 60కి పైగా సీట్లతో పార్లమెంట్‌లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కమ్యూనిస్టులు విబేధాలు, చీలికల కారణంగా నష్టపోయి బలహీనపడ్డారని సూత్రీకరించారు. దేశంలో ప్రాంతీయవాదం, మతతత్వం, డబ్బు ప్రభావం పెరిగిందని, కమ్యూనిస్టులు ఈ మూడింటికి దూరంగా ఉండడం వల్ల రాజకీయంగా బలహీనపడ్డారని విశ్లేషించారు. కమ్యూనిస్టుల చీలిక కారణంగా ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చినట్టయిందని ఆయన తెలిపారు. లేదంటే లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీయే నిలబడేదని అన్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. కమ్యూనిస్టులు పార్టీ వీడి ఇతర పార్టీల్లో చేరడంపై ప్రశ్నించగా.. రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని, ఈ పరిస్థితుల్లో ఒకరిద్దరు కమ్యూనిస్టు నేతలు పార్టీ వీడి ఉండొచ్చని, అంతమాత్రాన నేతలందరూ పార్టీ వీడుతున్నట్టు కాదని అన్నారు. కమ్యూనిస్టులు రాజకీయంగా చట్టసభల్లో బలహీనపడ్డప్పటికీ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో, ప్రజా సమస్యలపై పోరాటంలో నానాటికీ బలపడుతున్నారని నారాయణ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement