Thursday, April 18, 2024

వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ హామీ ఏమైంది? సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన ఎంపీ అరవింద్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వంద రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామన్న హామీ ఏమైందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును నిజామాబాద్ ఎంపీ (బీజేపీ) ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ పర్యటనలో రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాట్లాడిన మాటలు ఆత్మస్తుతి, పరనిందను తలపించాయని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఫామ్ హౌస్, బాలీవుడ్ గార్డెన్లు తప్ప మరేం గుర్తుండవని అరవింద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమికొట్టడం ఖాయమని అన్నారు.

కేటీఆర్ సోదరి కవితలా తానేమీ లిక్కర్ స్కాం చేయలేదని వ్యాఖ్యానించారు. చెరుకు, పసుపు రైతులకు కేసీఆర్, కేటీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు, వలస కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఒక దిశ, మార్గం, విధానం అనేవి ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి అక్కడి ఎమ్మెల్యేలను తెలంగాణ ఎమ్మెల్యతో పోల్చి చూస్తే  ఎవరు బాగా సంపాదించారో తెలుస్తుందని అన్నారు.

- Advertisement -

డీపీఆర్‌లు, అవసరమైన ఇతర పత్రాలు ఇవ్వకుండా కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా కావాలంటే ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇవ్వాల్సినవి ఇస్తే జాతీయ హోదా తీసుకొచ్చే తాను తీసుకుంటానని ప్రకటించారు. ఇతర కులాల వారిని కించపరిచే దొరతనం కేసీఆర్ కుటుంబానిదని, తెలంగాణ వచ్చాక కేసీఆర్, ఆయన కుటుంబం, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల జీవితాలు బాగుపడ్డాయి తప్ప సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని అరవింద్ అన్నారు. ఆర్మూరు, హైదరాబాద్‌లోని తమ ఇళ్లపై దాడులు  చేయించింది కేటీఆరేనని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement