Wednesday, April 17, 2024

Delhi | వివేక హత్యపై జగన్ మౌనం దేనికి సంకేతం? అర్థరాత్రి అమిత్ షాను ఎందుకు కలిశారు? : కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అంటూ సీబీఐ చేసిన ఆరోపణలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. సోమవారం ఢిల్లీలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సీబీఐ ఆరోపణలను ఖండించకుండా జగన్ మౌనం వహించడం మరిన్ని అనుమానాలకు, సందేహాలకు తావిస్తోందని అన్నారు. పైపెచ్చు అర్థరాత్రి పూట కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోందని కనకమేడల వ్యాఖ్యానించారు.

ఆదివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడం వెనుక ఎజెండా ఒక్కటేనని, అది వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డిని కాపాడ్డమేనని టీడీపీ ఎంపీ ఆరోపించారు. ఇలాంటి భేటీలు జరిగిన ప్రతిసారీ రాష్ట్ర అభివృద్ధి అంశాల గురించి చర్చించడం కోసమేనంటూ పాత ప్రెస్ నోట్లకు తేదీలు మార్చి విడుదల చేస్తున్నారని అన్నారు. అసలు అమిత్ షాతో ఏం చర్చించారో చెప్పాలని ఆయన సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. వివేక హత్యకేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి కర్నూలు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యను సృష్టించి అరెస్టు చేయనీయకుండా అడ్డుకుందని కనకమేడల ఆరోపించారు.

జరిగేదొకటి.. చెప్పేదొకటి

నీతి ఆయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ చెప్పిందొకటి, జరిగిందొకటని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఓవైపు వ్యక్తిగత కక్షతో నచ్చని పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమేస్తూ.. మరోవైపు పెట్టుబడులు, పరిశ్రమలు అంటూ మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఎలా వెళ్లిపోయిందో అందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు శంఖుస్థాపనలు తప్ప పూర్తిచేసి ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని వెల్లడించారు. నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ చెప్పినవన్నీ అవాస్తవాలు, అభూతకల్పనలని ఆరోపించారు.

- Advertisement -

ఏ రాష్ట్రమైనా అప్పులు చేయడం సహజమని, కానీ ఆ అప్పులు రాష్ట్రాభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగపడాలని అన్నారు. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వం చేసే అప్పులు అవినీతికి, దోపిడీకి ఆస్కారం కల్పిస్తున్నాయని మండిపడ్డారు. కొత్తగా సంపద సృష్టి లేకపోగా, ఉన్న సంపద ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా దారిమళ్లుతున్నాయని విమర్శించారు.

కొత్త పార్లమెంట్ భవనాన్ని దేశ సంపద అని, ప్రజాస్వామ్యానికి దిక్సూచి అని కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజున నూతన పార్లమెంట్ ప్రారంభం కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ గర్వకారణంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement