Tuesday, April 16, 2024

ప్రధాని మోదీ చెవిలో ఈ వ్యక్తి ఏం చెప్పాడు?

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇటీవల సోనాపూర్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తి ప్రధాని మోదీ చెవిలో ఏదో చెబుతున్నట్టు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు సదరు ఫొటోను ఎడిటింగ్ చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి స్వయంగా స్పందించాడు. అది నిజంగా తీసిన ఫొటోనే అని ఫోటోలో ఉన్న జుల్ఫిఖర్ అలీ ధ్రువీకరించాడు. ఫొటోషాప్ చేశారని ట్రోల్ చేస్తున్న వారికి.. తన ఓటర్ ఐడీ, తన వివరాలను జుల్ఫికర్ చూపించాడు. చాలా మంది రాజకీయ నాయకులు ముస్లింలు కాకపోయినా.. ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటున్నారని, కానీ తాను అసలైన ముస్లింనని చెప్పాడు. ఇంతకీ ప్రధాని చెవిలో అలీ ఏం చెప్పాడంటే..

‘అవును, ఆ ఫొటోలో ఉన్నది నేనే. ఎన్నో ఏళ్లుగా బీజేపీలోనే ఉన్నాను. అయితే, ఎప్పటి నుంచో ప్రధాని మోదీని కలవాలని కోరుకుంటున్నాను. కానీ, అది ఇలా నిజమవుతుందని ఊహించలేదు. ఆయన రాగానే నేను సెల్యూట్ చేశాను. ఆయనా తిరిగి అభివాదం చేశారు’ అని చెప్పాడు. ప్రధాని తన పేరును అడిగారన్నారు. ‘ఇంకా ఏమైనా కావాలా?’ అని అడిగారన్నారు. ‘‘నాకు ఎమ్మెల్యే టికెట్ గానీ, కౌన్సిలర్ పోస్టుగానీ వద్దని చెప్పా. నాకు కావాల్సిందల్లా మీతో ఒక ఫొటో మాత్రమే అని ఆయన చెవిలో చెప్పా. వెంటనే ఫొటోలు తీసుకున్నాం’ అని జుల్ఫికర్ వివరించారు. కేవలం 40 క్షణాల పాటే జరిగిన ఆ సంభాషణ.. తన జీవితంలో 40 ఏళ్ల పాటు నిలిచిపోతుందని వివరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement