Wednesday, April 24, 2024

బీసీలకు టీఆర్ఎస్ ఏం చేసింది.. బీసీ పాలసీ ఎందుకు అమలు చేయడం లేదు: కేవీ రంగ కిరణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీసీ పాలసీ అమలు చేస్తామన్న హామీ నాలుగేళ్లైనా అమలు కావడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కేవీ రంగ కిరణ్ ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా, సోషల్ మీడియా వర్క్‌షాపునకు ఆయన తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బీసీలు ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే అని ఆయన ధ్వజమెత్తారు. 2017లో బిసి ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేక భేటీ నిర్వహించారని, మూడు రోజులపాటు చర్చించి 210 తీర్మానాలు రూపొందించారని వివరించారు.

బీసీ సంఘాలతో చర్చించి శాఖ మంత్రులు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారన్నారు. కానీ నేటికీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఆ నివేదికలోని అంశాలు అమలుకు నోచుకోకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్, బీసీల ఇండస్ట్రియల్ పాలసీ, ఆర్థికపరమైన రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల బీసీలు ఇంకా దుర్భర పరిస్థితుల్లోనే జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్న సంచార జాతులను గాలికి వదిలేసిన పాపం సీఎం కేసీఆర్‌దేనని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement