Tuesday, March 21, 2023

ధరణికి ఆదరణ.. ఆచరణలోకి సరికొత్త ఫీచర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధరణిని మరింత కొత్త సాంకేతికలు, ప్రజలకు మెరుగైన సేవలతో ద్విగుణీకృతం చేసేందుకు సర్కార్‌ సమాయత్తమైంది. సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ నేతృత్వంలో మరిన్ని కీలక మాడ్యూల్స్‌ రెడీ అవుతున్నాయి. నెలరోజుల్లోగా ధరణి సరికొత్త పనితీరును సాక్షాత్కారంలోకి తెస్తామని ఆయన ఆంధ్రప్రభకు వెల్లడించారు. ఇప్పటికే కొత్తగా రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ డీటెయిల్స్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇప్పటివరకు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ సీసీ కాపీకానీ, రిజిస్టర్డ్‌ పత్రం నకలు కానీ ఇచ్చేందుకు వీలు లేదు. అయితే తాజా పరిణామాలు, ఫిర్యాదుల నేపథ్యంలో నేరుగా ధరణిలోనే రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ వివరాలను పొందే వీలును కల్పించారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌ను 10,65,96,125 మంది వీక్షించారు. తాకిడి పెరుగడతంఓపాటు ట్రాన్సాక్షన్ల పరంపరా నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని ఆధునికతలతో ఎవరినీ సంప్రదించే అవసరం లేకుండా నేరుగా ఫిర్యాదుదారు, రైతు, ఎవరైనా సరే అనుమానాల నివృత్తికి సమాచారం ధరణి పోర్టల్‌లో ఫోన్‌లోనే పొందేలా వెసులుబాటు తీసుకొచ్చింది. ఎఫ్‌ఏక్యూ (ఫ్రీక్వెంట్‌ ఆస్కింగ్‌ క్వశ్చన్స్‌) అనే సాంకేతికను పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు.

ఇప్పటివరకు జఠిల సమస్యగా ఉన్న ఏజీపీఏ, ఎస్పీఏలలో స్టాంపు డ్యూటీ అడ్జెస్ట్‌మెంట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక ఆప్షన్‌తో ఎన్నారైలకు ఎంతో వెసులుబాటు కల్గనుంది. ఈ మేరకు బుధవారం జీవో 26ను జారీ చేశారు. ఈ మేరకు అనువైన వ్యవస్థను తెచ్చి సమస్యలను పరిష్కరించాలని ఆయయన ఆదేశించారు. కార్డ్‌లో మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్లలోని ధరణి సహయాక కేంద్రాలు, మీ సేవల్లో రైతులు తమ భూములకు చెందిన సమస్యల పరిష్కారానికి సమాచారం కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవగాహనాలేమితో తప్పుడు మాడ్యూల్స్‌లో సమస్య పరిష్కారం కోరుతూ దరఖాస్తులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా తటిస్తించింది. దీంతో రైతాంగం తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త విధానంతో రైతులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించనున్నారు. తమకున్న సమస్యను పోర్టల్‌లోని మాడ్యూల్‌లో నమోదు చేయగానే దీని పరిష్కారం ఎలా..ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేయాలి…ఏఏ పత్రం జత చేయాలి అనే వివరాలను తెరపై చూపనున్నది.

- Advertisement -
   

వీలునామాల అమలుకు ఆప్‌షన్‌పై పరిశీలన జరుగుతోంది. అదేవిధంగా రెండు ఖాతాలు కల్గిన రైతులు ఒక ఖాతాలో ఆధార్‌ నమోదు చేసుకోకపోతే మళ్లి నమోదు చేసుకునేందుకు వెసులుబాటు చర్యలపై రెవెన్యూ యంత్రాంగం చర్చిస్తోంది. ధరణిలో తప్పుగా నమోదైన ఎంట్రీలను, అసైన్డ్‌ భూములకు చెందిన భూముల రికార్డుల్లో భూమి స్వభావాన్ని నిషేదిత జాబితాలోనుంచి తొలగించే ఆప్షన్‌కు కసరత్తు చేస్తున్నారు. థర్డ్‌ పార్టీ దరఖాస్తులకు అవకాశం లేకుండా ధరణిలో పక్కా వ్యవస్థను తీసుకొస్తున్నారు. తహశీల్దార్లు, ఆర్డీవోలు జారీ చేసిన ప్రొసీడింగ్‌లను, ఓఆర్‌సీలపై కీలక చర్యలు అమలు చేసేలా యోచిస్తున్నారు. తక్కువ ఎక్కువగా విస్తీర్ణాల నమోదును సరిచేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ధరణి రాకముందు జరిగిన రిజిస్ట్రేషన్ల రద్దు, అప్పట్లో మ్యుటేషన్‌ చేసుకోని వారికి అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా టీఎం 33కింద వచ్చిన లక్షలాది దరఖాస్తులను ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, వాటిని రోజుకు 500 దరఖాస్తుల చొప్పున పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.

వివాద జాబితాకు చెక్‌…

రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూముల్లో ఇంకా వివాదాలు ఉన్నాయి. వీటికి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పార్ట్‌ బిలో కాకుండా మరోసారి వీటిపై పున:పరిశీలన దిశగా యోచిస్తున్నది. అయితే ఈ విలువైన భూములకు చెందిన వివాదాలు ముఖ్యమైన నాలుగు జిల్లాల్లొనే అధికంగా ఉన్నాయని తేలింది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లాల్లోనే వీటి లెక్కలు ఎక్కువగా తేలాయి. కోర్టు వివాదాలు, అటవీ శాఖతో విభేదాలు, భూబదలాయింపు, క్రమబద్దీకరణలు, వ్యక్తిగత వివాదాలున్న అనేక రకాల భూ కేసుల సంఖ్య పది లక్షల ఎకరాల్లో ఉన్నట్లుగా స్పష్టమైంది. ఇందులో సివిల్‌ వివాదాల్లో 1,11,196 ఎకరాలుండగా, రెవెన్యూ కోర్టుల్లో మరో 42,318 ఎకరాల భూములున్నాయి. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాల్లో 2,04,729 ఎకరాలుగా తేల్చారు. భూ బదలాయింపు, క్రమబద్దీకరణల కింద 95,214 ఎకరాలు, అన్నదమ్ములు, వారసులు, బందువులు సరిహద్దు భూములు, ఇతర సమస్యలకు చెందిన వ్యక్తిగత వివాదాలకు చెందిన వ్యవహారాల్లో 5,48,527 ఎకరాలున్నాయి. వీటిని తాజాగా భూ రికార్డుల ప్రక్షాళనలో కొంత సరిదిద్దేందుకు నిబంధనలు అడ్డుగా వచ్చాయి. కోర్టు వివాదాలు, ఇతర చట్టాల నేపథ్యంలో ఈ భూములపై స్పష్టత రాలేదు.

కేటాయింపులపై ఆరా…

భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వెల్లడైన వివరాల ఆధారంగా గత భూ కేటాయింపులు, నిబంధనలకు విరుద్దంగా జరిగిన భూ పంపిణీపై సర్కార్‌ పున:సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా నిజాం కాలంలోనే గొప్ప ఆస్తులుగా పేరున్న వారసత్వ సర్కారీ, ఇనాం భూముల లెక్కలు కూడా తేలేందుకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలో భూముల ద్వారా రాబడికి వివిధ దశల్లో విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసిన సర్కార్‌ తాజాగా గత కేటాయింపులన్నింటిపై సమగ్ర సమీక్షకు సిద్దమవుతోంది. తాజాగా అసైన్‌మెంట్‌ విభాగంలో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఆయా దస్త్రాల్లో పేర్కొన్నట్లుగా ప్రభుత్వ భూములను ఏఏ అవసరాలకు ఎవరెవరికి ఎంత మొత్తంలో కేటాయించారనే లెక్కలను సమగ్రంగా సేకరిస్తోంది. నివేదికలోని వివరాలను ప్రభుత్వ రికార్డులతో పోల్చి చూస్తున్నారు. తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భూములు ఎవరికి కేటాయించారు… వాటిని నిర్ధేశిత అవసరాలకు వినియోగించారా… లేదా అనే అంశం తేల్చేందుకు రంగం సిద్దమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement