Thursday, April 18, 2024

దేశంలో మరో రాష్ట్రంలో లాక్‌డౌన్

కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. అయితే ఏ రాష్ట్రం పూర్తిగా లాక్‌డౌన్ విధించడం లేదు. మహారాష్ట్ర , పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌ అమలులో ఉంది. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో పయనిస్తోంది. కరోనా పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ‘కరోనా పెరుగుదల దృష్ట్యా రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ లాక్‌డౌన్ ఉంటుంది. అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ ఈ లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. పెద్ద పెద్ద సిటీల్లో మాత్రం కంటైన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తాం.’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు.

కాగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3.18 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 4వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రధాన నగరాలు ఇండోర్, భోపాల్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఈ రెండు నగరాల నుంచే అధికంగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement