Tuesday, March 26, 2024

అలర్ట్: మాస్క్ ధరించడంతో కొత్త ఇబ్బందులు

ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కు తప్పనిసరి. కరోనా బారినపడకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. చాలాసేపు మాస్కు ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఇది పరోక్షంగా గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్‌ సమస్యలకు కారణమవుతోందని దంత వైద్య నిపుణలు చెబుతున్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా నోటిని క్లీనింగ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర చికిత్సలతో పోలిస్తే.. దంత చికిత్సలు ఎమర్జెన్సీ కాకపోవడంతో చాలా మంది వీటిని వాయిదా వేసుకుంటున్నారు. కోవిడ్‌కు భయపడి గతేడాది నుంచి వీటికి దూరంగా ఉంటున్నారు. అయితే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలో సూక్ష్మజీవులు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక దంత సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మంది పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతుండగా.. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్‌ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. జన సమూహంలోకి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. దీంతో పీల్చిన గాలే పీల్చడంతో నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుంది. నోటి దుర్వాసన, గొంతు నొప్పికే కాకుండా గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుంది.

నిజానికి 6 నెలలకోసారి దంతాలను క్లీన్‌ చేయించుకోవాలి. లేదంటే దంతాల చుట్టూ పాచీ పేరుకుపోయి వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌కు నిలయంగా మారుతుంది. అనేక మంది చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నారు. దంతాల మధ్యలో పాచీ పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు తలెత్తి దంతాలు పటుత్వాన్ని కోల్పోతాయి. రోజంతా మాస్కు ధరించడం వల్ల మంచినీరు తక్కువగా తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంటుంది. దీంతో దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధికి కారణమవుతుంది. ఇప్పటికే కోవిడ్‌ టీకా తీసుకున్న వారు దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Advertisement

తాజా వార్తలు

Advertisement