Saturday, April 20, 2024

Delhi | ప్రైవేటీకరణ చేయబోము, వేలంతో పారదర్శకత.. ఉత్తమ్ ప్ర‌శ్న‌కు ప్రహ్లాద్ జోషి వివరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణ చేసే ఆలోచనేదీ లేదని, ఒకవేళ చేయాలనుకున్నా సాధ్యం కాదని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు జీరో అవర్లో కాంగ్రెస్ ఎంపీ (నల్గొండ) ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో తెలంగాణలోని 4 బొగ్గు గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. గత 20 ఏళ్లుగా లాభాల్లో ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు. బొగ్గు గనులు తమకు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే కేంద్రం ప్రైవేటుపరం చేయడం సరికాదని అన్నారు.

ఈ అంశంపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెంటనే స్పందిస్తూ ఒక ప్రకటన చేశారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని వ్యాఖ్యానించారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉన్నప్పుడు 49% వాటా కల్గిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని తెలిపారు. పూర్తి పారదర్శకంగా వేలం ప్రక్రియ ద్వారా జరుగుతున్న బొగ్గు గనుల కేటాయింపుపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కల్గిన రాష్ట్రాలకు మరిన్ని ప్రయోజనాలు కల్గుతున్నాయని, అందుకే అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు సైతం వేలం పద్ధతిని స్వాగతించి అమలుచేస్తున్నాయన్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుందని తెలిపారు. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శకంగా సాగుతున్న వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి చురకలు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement